mt_logo

నేడు ఐరాస ‘బెస్ట్ టూరిజం విలేజ్’ అవార్డు అందుకున్న భూదాన్ పోచంపల్లి

ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “బెస్ట్ టూరిజం విలేజ్” విభాగంలో ఎంపికైన భూదాన్ పోచంపల్లి గ్రామానికి ‘బెస్ట్ టూరిజం విలేజ్’ అవార్డు అందజేశారు. స్వీడన్ లోని మాడ్రిడ్ నగరంలోని యూఎన్‌డబ్ల్యూటీవో కార్యాలయంలో గురువారం సాయంత్రం 24వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ అవార్డు అందజేయగా.. స్వీడన్ లోని భారత రాయబార కార్యాలయ రెండవ కార్యదర్శి సుమన్ శేఖర్ దానిని అందుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ పర్యాటక రంగం అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ‘బెస్ట్ టూరిజం విల్లేజ్’ గా భూదాన్ పోచంపల్లి గ్రామంను ఎంపిక చేసినందుకు యూఎన్‌డబ్ల్యూటీవోకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుండి 170 ఎంట్రీలు ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ కు వెళ్లగా.. అందులో మన దేశం నుంచి భూదాన్‌ పోచంపల్లితో పాటు మేఘాలయలోని కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని లద్‌పురాఖాస్‌ కూడా పోటీలో ఉన్నాయన్నారు. అన్ని గ్రామాలను వెనక్కి నెట్టి తెలంగాణ ప్రభుత్వం పంపిన నివేదిక ఆధారంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి గ్రామం ‘బెస్ట్ టూరిజం విలేజ్’ గా ఘనత సాధించిందన్నారు. నేడు పోచంపల్లికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు రావడం వెనుక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల నిరంతర కృషి కారణం అని గుర్తు చేశారు.

ప్రపంచ వారసత్వ గుర్తింపుకు ప్రయత్నిస్తాం :

హైదరాబాద్ నగర శివారులో వున్న పోచంపల్లి గ్రామం నూలు మరియు పట్టు, చేనేతల ఉత్పత్తి కేంద్రంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిందన్నారు. ‘పోచంపల్లి ఇకత్’ చేనేత వస్త్రాలు అనేక సంవత్సరలుగా ప్రజాదరణ పొందటమే కాక దేశంలో అత్యంత ప్రీతి పాత్రమైన చేనేత వస్త్రాలుగా పేరు ప్రఖ్యాతులు సాధించాయన్నారు. పోచంపల్లి చేనేత మగ్గాలకు భౌగోళిక సూచిక దృవీకరణ (GI) తోపాటు, మేధో సంపత్తి హక్కుల రక్షణ కలిగిన కళాఖండంగా గుర్తింపు పొందిందన్నారు. అలాగే పోచంపల్లిని ప్రపంచ వారసత్వ కట్టడాలలో ఒకటిగా గుర్తింపు పొందే విధంగా తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ టూరిజం అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *