మాతాశిశు సంరక్షణకు తెలంగాణ ప్రభత్వం తీసుకుంటున్న చర్యలపై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాల కోసం మిడ్ వైఫరీలకు ఇస్తున్న శిక్షణను అభినందిస్తూ యునిసెఫ్ ఇండియా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. హైదరాబాద్ లోని ఓ ఏరియా ఆసుపత్రిలో మిడ్ వైఫరీ ద్వారా పురుడు పోసుకున్న శిశువు ఫొటోను జత చేస్తూ, ఫర్ ఎవ్రీ చైల్డ్, ఎ హెల్తీ స్టార్ట్ అనే హ్యాష్‌ట్యాగ్ అని రాసి మెచ్చుకుంది.
గర్భిణీలకు సాధారణ ప్రసవాలు – సంరక్షణ అంశంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు గొప్పగా ఉందని యునిసెఫ్ ఇండియా పేర్కొంది. ప్రసవ సమయంలో తల్లిబిడ్డలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పాజిటివ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్ కలిగేలా మిడ్ వైవ్స్ కు శిక్షణ ఇస్తోందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ఈ శిక్షణ అద్భుతంగా ఉందని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల శాఖ, నర్సింగ్ డైరెక్టర్ జనరల్ రతి బాలచంద్రన్ కొనియాడారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం ఫెర్నాండెజ్ ఫౌండేషన్ ఆసుపత్రితో పాటు, మరో ఐదు దావఖానాల్లో ఈ శిక్షణను నిర్వహిస్తోంది. గర్భిణులు సాధారణ ప్రసవం జరగడానికి తీసుకోవాల్సిన వ్యాయామం, ఆహారం… సాధారణ ప్రసవం వల్ల లాభాలు మరియు సాధారణ ప్రసవాలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఎలా చేయాలి అనే విధానంపై శిక్షణ ఇస్తున్నారు.