mt_logo

‘కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలేవీ’..? బండి సంజయ్ ని నిలదీసిన నిరుద్యోగి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అందరిముందు నిలదీసాడో నిరుద్యోగి. అసలు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చింది? ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్‌ చేసింది? అధికారంలోకి రాగానే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం.. ఆ హామీని నెరవేర్చిందా ? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ సంజయ్‌ను నిలదీశాడు. యువకుడి అనుకోని ఎదురు ప్రశ్నలకు ఏం జవాబివ్వాలో అర్థంకాక అక్కడి నుండి మౌనంగా నిష్క్రమించారు బండి సంజయ్. వివరాల్లోకెళితే.. ఈ నెల 16న నిర్వహించనున్న నిరుద్యోగుల మిలియన్‌ మార్చ్‌లో భాగంగా శుక్రవారం సాయంత్రం బండి సంజయ్‌ అశోక్‌నగర్‌లోని కేంద్ర గ్రంథాలయానికి వచ్చారు. రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని గ్రంథాలయంలో చదువుకుంటున్న విద్యార్థులను రెచ్చగొట్టే యత్నం చేశారు. అయితే అక్కడే ఉన్న నిరుద్యోగి సురేశ్‌..” 2014 ఎన్నికల హామీల్లో భాగంగా నరేంద్రమోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు, అవేమయ్యాయి ? కేంద్ర ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందో చెప్పండి ?” అని బండి సంజయ్ ని అడగగా.. ఈ ప్రశ్నకు సమాధానం లేని బండి సంజయ్‌ తడబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ద్వారా లక్షన్నరకు పైగా ఉద్యోగాలు కల్పించిందని, ఉద్యోగాలు ఇవ్వలేని కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించే ధైర్యం లేక రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని సురేశ్‌ ఆవేశంగా చెప్పడంతో..దానికి మరింత మంది విద్యార్థులు తోడయ్యి సంజయ్ ని నిలదీయగా… అనుకోని పరిణామానికి బండి సంజయ్‌ బిత్తరపోయారు. బీజేపీ నేతలు, పోలీసులు సురేశ్‌ను సహా విద్యార్థులను పక్కకు తీసుకెళ్లి సముదాయించే ప్రయత్నం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *