సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి బోనాలు సమర్పిచేందుకు పెద్దఎత్తున భక్తులు ఆలయం వద్దకు తరలి రాగా… డప్పుల దరువులు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తొలి బోనం ఉదయం ఐదుగంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున మహిళలతో ర్యాలీగా ఆలయ ప్రాంగణానికి చేరుకుని అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… వరద ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని, పంటలు, ప్రాణనష్టం కలగకుండా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అమ్మవారిని సందర్శించుకుని… బోనాల ఉత్సవాలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా బారీక్లేడు, మంచినీరు, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. తరువాత ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని, ఎలాంటి కష్టాలు వచ్చిన అమ్మ కాపాడుతుందన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కరుణ కటక్షాలతో మనమంతా సుఖంగా ఉన్నామని, తల్లి కృప రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.