తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను మళ్ళీ కలుపుతానని చంద్రబాబు చెప్పడం అవివేకమని, ఈ విషయంపై తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ అధ్యక్షపదవిని ఎవరికీ కేటాయించలేని నిస్సహాయ పరిస్థితిలో ఆ పార్టీ ఉందని, జిల్లా పరిషత్ లలో కూడా టీఆర్ఎస్ జెండానే ఎగురుతుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలోనే బంగారు తెలంగాణ నిర్మితమవుతుందని, టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
మంగళవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడుతూ, సీమాంధ్రను అభివృద్ధి చేసే విధానాన్ని చూసి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, బాబు చేసిన అభివృద్ధిని చూసే తెలంగాణలో ప్రజలు టీడీపీని బొందపెట్టారని మండిపడ్డారు. టీఆర్ఎస్ తో, తెలంగాణతో పోటీ పడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని హరీష్ రావు పేర్కొన్నారు.