తెలంగాణ రాష్ట్రానికి కాబోయే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలపడానికి వస్తున్న అధికారులు, ఉద్యోగసంఘాల నేతలు, కార్యకర్తలు, ప్రజలతో ఆయన నివాసం జాతరను తలపిస్తుంది. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉన్నతాధికారులు కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తున్నారు. పరిపాలన సక్రమంగా సాగడానికి తాము అన్నివిధాలా ప్రభుత్వానికి సహకరిస్తామని కేసీఆర్ కు వారు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ పదిజిల్లాలనుండి వచ్చే కార్యకర్తలు, అభిమానులు, ఉద్యోగ సంఘాల నేతలు, అడ్వొకేట్ జేఏసీ నేతలు, మహిళా సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు పలువురు కేసీఆర్ ను కలవడానికి బారులు తీరి ఉన్నారు. అభిమానులను నిరుత్సాహపరచకుండా కేసీఆర్ అందరితో ఓపిగ్గా మాట్లాడారు. వీరే కాకుండా పలువురు ఎమ్మెల్యేలు, ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, అమెరికాకు చెందిన లియాన్ సంస్థ ప్రతినిధులు కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా జూన్ 2న మధ్యాహ్నం గం.12:55ని.లకు కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. అయితే ప్రమాణస్వీకారోత్సవం రాజ్ భవన్ లో జరపాలా? ఎల్బీ స్టేడియంలో జరపాలా? అనే విషయం ఇంకా నిర్ణయించుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.