వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 4,15,931 మంది ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారని, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలే అన్నారు. లక్షా 77 వేల 444 ఖాళీలు ఉన్నాయని, వీటన్నింటినీ ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
పక్క రాష్ట్రంలో పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంచారని, మన రాష్ట్రంలో కూడా ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈటెల సమాధానం ఇస్తూ తెలంగాణలో ఇప్పటికే ఎంతోమంది నిరుద్యోగ యువతీ, యువకులు ఉన్నారని, పదవీవిరమణ వయస్సు పెంచితే వారికి అన్యాయం జరుగుతుందని ఆర్ధికమంత్రి ఈటెల స్పష్టం చేశారు. ఏడాదికి కనీసం 10 వేలమంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారని, 60 ఏళ్లకు పెంచితే ఈ ఖాళీలు ఏర్పడే అవకాశం ఉండదని, దీనివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని అన్నారు.