mt_logo

సమైక్య పాలనలో చెరువులు ధ్వంసం..

శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా చెరువుల పునరుద్ధరణపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, కాకతీయులు, నిజాంల కాలంలో చెరువుల తవ్వకాలు జరిగాయని, గత పాలకుల కుట్రల వల్లే చెరువులు ధ్వంసమయ్యాయని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పూడికతీత చేపడతామని, కాకతీయుల స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి మిషన్ కాకతీయ అని పేరును పెట్టామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

కాకతీయ తోరణాన్ని తెలంగాణ లోగోలో చేర్చడమే కాకుండా కాకతీయుల స్ఫూర్తిని తెలంగాణ పునరుద్ధరణలో కొనసాగించేందుకే చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ అనే పేరు ఎన్నుకున్నామని హరీష్ తెలిపారు. తెలంగాణ పదిజిల్లాలకు కలిపి ఐదుగురే ఎస్ఈలు ఉన్నారని, ఉద్యోగుల కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనులను చేపట్టేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రతి ఎస్ఈకి ఒక ల్యాప్ టాప్ ఇస్తున్నామని, డిపార్ట్ మెంట్ కు సర్వే సామాగ్రి కొనిచ్చామని, ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేపట్టిన చెరువుల ఫొటోలను అప్ లోడ్ చేయనున్నామని చెప్పారు.

చెరువుల పునరుద్ధరణలో అవినీతి, అవకతవకలకు తావులేకుండా ఈ-ప్రొక్యూర్ మెంట్ ద్వారా టెండర్లను పిలిచి పనులను పారదర్శకంగా చేపట్టనున్నట్లు హరీష్ తెలిపారు. దేశంలోనే అత్యధిక చెరువులు తెలంగాణలోనే ఉన్నాయని, రాష్ట్రంలో దాదాపు 54 వేల పైచిలుకు చెరువులున్నాయన్నారు. అలుగులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించనున్నట్లు, ఏడాదికి 20 శాతం చొప్పున చెరువులను పునరుద్ధరిస్తామని హరీష్ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *