తెలంగాణ కోసం ప్రాణాన్నే ఫణంగా పెట్టా.. ఎవరో ఇస్తే అధికారంలోకి రాలేదు.. ప్రజలు ఆశీర్వదిస్తేనే అధికారంలోకి వచ్చామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శాసనసభలో డీఎల్ఎఫ్ భూములపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకోవాలని, ఈ భూముల విషయంలో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని, కొందరు నేతలు ఎంగిలి మెతుకులకు ఆశపడి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయల విలువైన తెలంగాణ భూములను తెగనమ్మారని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.580.51 కోట్లతో 31.31 ఎకరాల భూమిని డీఎల్ఎఫ్ కొనుగోలు చేసిందని, శేరిలింగంపల్లిలో 471 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించారని, కొంత భూమిని విక్రయించి ఏపీఐఐసీ ప్రభుత్వానికి నిధులు అందజేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే భూముల కేటాయింపులు జరిగిపోయాయని, మైహోం సంస్థ 10 ఎకరాల భూమిని రూ. 200 కోట్లకు కొనుగోలు చేసిందని, పొరపాటు వల్ల వారసత్వ భూములను అమ్మామని గత ప్రభుత్వం ఒప్పుకుందని కేసీఆర్ చెప్పారు.
ప్రభుత్వంపైన, సీఎం పైనా గత కొద్దిరోజులుగా నిరాధార ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సభలో చేసిన ఆరోపణలకు ఆధారం చూపని సభ్యులను సభనుండి డిస్మిస్ చేయాలని కేసీఆర్ స్పీకర్ ను కోరారు. ప్రభుత్వం ఏర్పడి వారంరోజులైనా కాకముందే ఒక దొర ఇంకో దొర కోసం సిమెంట్ ధరను పెంచారని పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళేలా చేశారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రమైన ఏపీలో కంటే తెలంగాణ లోనే సిమెంట్ ధర తక్కువగా ఉందని, మరి అక్కడ ఎవరు చెబితే ధరలు పెరిగాయని సీఎం ప్రశ్నించారు.
వాస్తవాలు మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, భూ బదలాయింపు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు గత ప్రభుత్వ నిర్ణయమని, తాడుబొంగరం లేకుండా గేమింగ్ సిటీకి ప్లాన్ చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, సింగిల్ విండో చైర్మన్ నుండి కేంద్రమంత్రి దాకా పనిచేశానని, ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని కేసీఆర్ సూచించారు.