mt_logo

అటవీ అనుమతులపై రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి సమావేశం

వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించి అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు (రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి) సమావేశం అరణ్య భవన్ లో జరిగింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వైస్ చైర్మన్, స్టేట్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ హోదాలో అధ్యక్షత వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలు చేపట్టిన 30 అభివృద్ది కార్యక్రమాలు, వాటికి అవసరమైన అటవీ అనుమతులపై ఐదవ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి సమావేశంలో చర్చజరిగింది. అదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో చేపట్టిన రోడ్ల విస్తరణ, విద్యుత్ ఆధునీకరణ, టీ ఫైబర్ గ్రిడ్ పనుల అనుమతులపై చర్చించారు. వైల్డ్ లైఫ్ బోర్డులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు, అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమాధానాలు వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అభివృద్ది కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని, అలాగే అటవీ ప్రాంతానికి వీలైనంత తక్కువ నష్టం జరిగే విధంగా ప్రతిపాదనలు రూపొందించామని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర స్థాయి అనుమతుల తర్వాత కేంద్ర అనుమతులు అవసరం అయితే, ఆ ప్రతిపాదనలు కేంద్ర వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపుతామని పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు అటవీ శాఖ ఉన్నతాధికారులు, స్టేట్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *