mt_logo

ప్రాణనష్టం జరగకుండా చూడండి… భారీ వర్షాలు, వరదలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాల పరిస్థితుల పైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ జిహెచ్ఎంసి, జలమండలి మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకొని… ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల వల్ల ప్రభావితమైన హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి సారించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాలు ఇలాగే కొనసాగితే చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యల పైన కూడా ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వరుసగా కురుస్తున్న వర్షాల వలన పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్నందున, ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించే చర్యలు కొనసాగించాలని తెలిపారు. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాల వద్ద హెచ్చరిక సూచీలను ఏర్పాటు చేయాలని, స్థానికంగా ఉన్న పోలీస్, సాగునీటి, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరం మరియు పరిసర పురపాలికల్లోని యంత్రాంగం, స్థానిక జలమండలి కలిసి వరద నివారణ చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసి, జలమండలి కమాండ్ కంట్రోల్ సెంటర్లను విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పూరపాలికల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిడిఎంఏ ను మంత్రి ఆదేశించారు. పట్టణాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి సారించి, పట్టణాలకు ఆనుకొని ఉన్న చెరువులు, కుంటలు, ఇతర సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణను నిరంతరం కొనసాగించాలని తెలియ జేశారు. వాటి యొక్క పూర్తిస్థాయి నిలువ సామర్థ్యం, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వంటి పై సాగునీటి శాఖతో నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే అత్యవసరమైన రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *