రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆగ్రోస్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది. ఆగ్రోస్ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు ఈ అవార్డు దక్కింది. మంగళవారం ఆన్లైన్ ద్వారా ఈ అవార్డును అందజేశారు. రైతులను యాంత్రీకరణ వైపు మళ్లించేలా, సకాలంలో ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేసేలా ఆగ్రోస్ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే వెయ్యికి పైగా రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను గ్రామాల్లోనే రైతులకు అందుబాటులో ఉండేలా చేసింది. వీటిని పూర్తిగా నిరుద్యోగ యువతకు కేటాయిస్తూ వారికి ఉపాధి కల్పిస్తుండటం గమనార్హం. ఇందుకోసం వీరికి రుణాలు ఇప్పిస్తూ అండగా నిలుస్తున్నది. తాజాగా మిల్లెట్ రంగంలోకి ఆగ్రోస్ అడుగు పెడుతున్నది. ఆగ్రోస్‌కు స్కోచ్ అవార్డు దక్కడంపై ఆ సంస్థ ఎండీ రాములు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఆయనను అభినందించారు.
