mt_logo

టీఆర్‌టీయూ, తెలంగాణ పీఆర్‌టీయూ విలీనం..

తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రధాన ఉపాధ్యాయసంఘాలైన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(టీఆర్‌టీయూ), తెలంగాణ ప్రోగ్రెసివ్ ఉపాధ్యాయ సంఘం(పీఆర్‌టీయూ) విలీనమై ఒకే సంఘంగా ఏర్పాటై టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. నూతన సంఘం పేరు, సంఘం కార్యవర్గ ఏర్పాటు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అప్పగిస్తూ ఆదివారం తెలంగాణ భవన్ లో రెండుసంఘాల సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.  టీఆర్‌టీయూ తరపున ఎం. మణిపాల్ రెడ్డిని ప్రతినిధిగా ప్రతిపాదిస్తూ తీర్మానించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ కవిత  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో రెండు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు విలీనమవ్వడం ఉపాధ్యాయులకే కాకుండా విద్యారంగానికి కూడా ఎంతో మేలు చేస్తుందని, తెలంగాణ ఉద్యమంలో ముందుకు ఉరికింది విద్యార్ధులైతే వారిని తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులదని అన్నారు. తెలంగాణ భావజాలంతో ఇంకా ఎన్ని సంఘాలు ముందుకొచ్చినా సంతోషంగా వారిని కూడా ఆహ్వానిస్తామని, తెలంగాణ ప్రభుత్వం, ఉపాధ్యాయుల మధ్య సానుకూల వాతావరణం ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందని, అందరినీ కలుపుకుని ముందుకుపోదామని కవిత పేర్కొన్నారు. వీలైనంత త్వరలో నూతన సంఘానికి అన్ని వసతులతో కూడిన భవనాన్ని నిర్మించుకుందామని, విద్యారంగ అభివృద్ధికై ఉపాధ్యాయులు తగిన సూచనలివ్వాలని ఆమె కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *