ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలవుతుందని, అది తెలంగాణ నుండే ప్రారంభమవుతుందేమో అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు.. మోదీ రాజ్యాంగం అమలవుతుందని నిప్పులు చెరిగారు. బీజేపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరే ఉన్నాయని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణకు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తారనే సంపూర్ణ విశ్వాసంతో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపామని కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణగా మద్దతు ప్రకటించాం. యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ రావాలని ఆహ్వానించాం. హైదరాబాద్‌లో తమ ఎంపీలు, శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు మద్దతు తెలుపుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లో ఉంచుకొని విపక్షాల మీద వేటకుక్కల్లాగా వాటిని ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారని ప్రధాని మోదీపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాన్ని తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న అన్ని పార్టీలకు ఉంటుందన్నారు. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నామని తేల్చిచెప్పారు. బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న వైఖరికి వ్యతిరేకంగా, అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి విపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. యశ్వంత్ సిన్హా గెలువాలని, రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా మాకు ఇబ్బంది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆవిడ మంచి వ్యక్తే కావొచ్చు. గిరిజన, మహిళా అభ్యర్థిని చెప్పడం సరికాదు. జనవరి 2, 2006లో ఒడిశాలో కళింగనగర్‌లో స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళన చేస్తున్న 13 మంది గిరిజనులను కాల్చిచంపారు. అప్పటి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. ద్రౌపది నాడు మంత్రి కూడా. నాడు ఆమె ఎలాంటి సానుభూతి తెలుపలేదు. గిరిజనులకు అన్యాయం జరిగిందని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజంగానే గిరిజనులపై ప్రేమ ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను పెంచాలని కోరుతున్నాం. ఒక వేళ నిజంగానే గిరిజనులపై ప్రేమ ఉంటే ఇప్పటి వరకు చేసి ఉండాలి. కానీ ఉలుకు పలుకు లేదు. ట్రైబల్ యూనివర్సిటీ పెడుతామని పునర్విభజన చట్టంలో చెప్పారు. ఈ రోజు వరకు అతీగతీ లేదు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. బీజేపీ వ్యవహారం దేశంలోని గిరిజనులకు, తెలంగాణలోని గిరిజనులకు బాగా తెలుసు. చిత్తశుద్ధి ఉంటే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. రిజర్వేషన్లను పెంచాలి. ఏడు మండలాలను తిరిగి వెనక్కి ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.