తెలంగాణ రాష్ట్రంలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గంగా మల్కాజిగిరికి పేరుంది. భిన్న మతాల, ప్రాంతాల, విభిన్న సంస్కృతుల ప్రజలు ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఎల్బీ నగర్, కూకట్ పల్లి, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లతో కలిపి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంగా రూపొందింది.
గత ఎన్నికలతో పోల్చితే ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఇక్కడి ప్రజానీకం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గం మినహా మిగతా ఆరు చోట్ల టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. అయితే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా గులాబీ గూటికి చేరనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో ఉన్న మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు సునాయాసం కానుంది. మెజార్టీ పైనే తమ దృష్టి ఉంటుందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.