దేశానికి చౌకీదార్లు, టేకేదార్లు అవసరం లేదని, ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చే కేసీఆర్ లాంటి జిమ్మేదార్లు కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే తారకరామారావు చెప్పారు. సోమవారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ గాంధీకి, బీజేపీకి ఓటేస్తే మోడీకి లాభమని, అదే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు లాభం కలుగుతుందని స్పష్టం చేశారు. మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ కు ఓటేసి 16 మంది ఎంపీలను గెలిపించుకుంటే కేంద్రాన్ని శాసించవచ్చని, ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎవరు ఎగరేయాలో నిర్ణయించే శక్తి తెలంగాణ ప్రజలదే అవుతుందని కేటీఆర్ అన్నారు.
పేగులు తెంచుకుని కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్న సత్తా ఉన్న గులాబీ సైనికులకే కేంద్రాన్ని నిలదీసే దమ్మూ, ధైర్యం ఉంటుందని, పదహారు మంది ఎంపీలు గెలిస్తే కాళేశ్వరానికి జాతీయహోదా, రాష్ట్రానికి మెగా పవర్ లూం క్లస్టర్లు నడుచుకుంటూ వస్తాయని కేటీఆర్ చెప్పారు. దేశంలో నంబర్ వన్ సీఎం గా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్తంగా పేరు పొందారని, 79% ప్రజలు మెచ్చుకున్నారని గుర్తుచేశారు. 2 ఎంపీ స్థానాలతో తెలంగాణ తెచ్చుకున్న మనం 16 సీట్లు గెలిపించుకుని ఢిల్లీలో చక్రం తిప్పలేమా? టీఆర్ఎస్ తో పాటు బెంగాల్ లో మమతాబెనర్జీ, యూపీలో మాయావతి, అఖిలేష్ యాదవ్, ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీల ఎంపీలను కలుపుకుంటే ఎంపీల సంఖ్య 170 వరకు ఉంటుంది. ఇంతమంది ఎంపీలు ఉంటే దెబ్బకు ఢిల్లీ దిగిరాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా అభివృద్ధితోపాటు తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిన ఎంపీ అభ్యర్ధి బోయినపల్లి వినోద్ కుమార్ ను మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. అనంతరం బీ. వినోద్ కుమార్ మాట్లాడుతూ పదహారు మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే దేశరాజకీయాల్లో మనమే కీలకం కానున్నామని, రాబోయేది సంకీర్ణ యుగమేనని, ప్రాంతీయ పార్టీల కూటములదే అధికారం అని అన్నారు. ఎంపీగా ఆశీర్వదిస్తే జిల్లాకు మంచిపేరు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.