2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంది. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పార్టీ 119అసెంబ్లీ స్థానాలకు గానూ, 45స్థానాలు గెలుపొంది మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 19,391ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నల్లగొండ జిల్లా భువనగిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘోర ఓటమిని చవిచూశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ చేతిలో రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారు.
వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ గెలుపొందారు. సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ 29వేల 500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కరీంనగర్ జిల్లా మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు చేతిలో 16,800 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అహ్మద్ గెలుపొందారు. మాజీ మంత్రి గీతారెడ్డి స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు.
ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. కొత్తగూడెం టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా, కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ ఓటమి పాలవ్వగా, టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ విజయం సాధించారు. సిద్దిపేటలో హరీష్ రావు భారీ మెజారిటీతో విజయం సాధించారు. 93,350 ఓట్ల మెజారిటీతో హరీష్ రావు గెలుపొందారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నుండి కాంగ్రెస్ నేత జయసుధ ఓడిపోగా, టీఆర్ఎస్ నేత కత్తి పద్మారావు గెలిచారు. సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి జీ జగదీశ్వర్ రెడ్డి గెలుపొందారు.
నకిరేకల్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి వీరేశం, కరీంనగర్ జిల్లా మానకొండూరు నుండి రసమయి బాలకిషన్, వరంగల్ వెస్ట్ దాస్యం వినయ్ భాస్కర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్, కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి, షాద్ నగర్ లో అంజయ్యయాదవ్, దేవరకద్రలో ఆలె వెంకటేశ్వర్ రెడ్డి, తాండూరులో మహేందర్ రెడ్డి, వికారాబాద్ లో సంజీవరావు విజయ దుందుభి మోగించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి ఓటమి పాలవ్వగా, టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదనాచారి, మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు, నల్లగొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్ కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ పైవిజయం సాధించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి వీ శ్రీనివాస్ గౌడ్ గెలుపొందారు.