mt_logo

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు

* ముషీరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ ఓటమి చవిచూశారు. అటు నల్లగొండ, హుజూర్ నగర్, కోదాడ, నాగార్జునసాగర్ ల నుండి పోటీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, పద్మావతి, జానారెడ్డిలు విజయం సాధించారు.

*కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ 34,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆందోల్ లో డిప్యూటీ స్పీకర్ దామోదర రాజనర్సింహ ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి బాబూమోహన్ 3,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ పై గెలుపొందారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఘోరంగా ఓడిపోయారు. పొన్నాలపై టీఆర్ఎస్ అభ్యర్థి యాదగిరి రెడ్డి ఆధిక్యం సాధించారు. నల్లగొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తాటికొండ రాజయ్య విజయం సాధించారు.

*తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ తొలి బోణీ కొట్టింది. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి 2,40,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

*వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి కొండా సురేఖ 47,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజు సారయ్యపై గెలుపొందారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ రమేష్ 53వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

*తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తొలిఫలితం వెలువడింది. నల్లగొండ జిల్లా, భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి 13వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నల్లగొండ జిల్లా, ఆలేరు ఎమ్మెల్యేగా గొంగిడి సునీత విజయం సాధించారు. కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ 40,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మెదక్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతిపై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి సీహెచ్ మదన్ రెడ్డి 5000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మెదక్ జిల్లా దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 25,000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డిపై గెలిచారు.

*మెదక్ జిల్లా సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారెడ్డి ఓటమికి చేరువలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ముందంజలో ఉన్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా వెనుకంజలో ఉన్నారు.

*టీఆర్ఎస్ ఎంపీల హవా ఎక్కడా ఆగకుండా ముందుకు దూసుకుపోతుంది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్ కుమార్ 57,777, భువనగిరి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ 22,000, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత 37 వేలు, పెద్దపల్లిలో బాల్క సుమన్ 25,400, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి లక్ష ఓట్లకుపైగా, మెదక్ ఎంపీ అభ్యర్థి కేసీఆర్ 1,24,000 ఓట్లకుపైగా, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మందా జగన్నాథం 18వేల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

*నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందుకు దూసుకుపోతున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా 4500, బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి 5432, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ 3841, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి 4598, జుక్కల్ లో హన్మంత్ షిండే 6638, బోధన్ లో షకీల్ అహ్మద్ 550, బాల్కొండ లో ప్రశాంత్ రెడ్డి 1200, ఆర్మూర్ జీవన్ రెడ్డి 1656 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు.

*తెలంగాణలో టీఆర్ఎస్ సంపూర్ణ మెజారిటీ దిశగా అడుగులేస్తుంది. 119 అసెంబ్లీ స్థానాలకు గానూ టీఆర్ఎస్-62, కాంగ్రెస్-21, టీడీపీ-13, బీజేపీ-2, ఎంఐఎం-8, ఇతరులు-4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కేటీఆర్ 17వేల ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కరీంనగర్ జిల్లా అన్ని నియోజకవర్గాల్లో కారు జోరుమీదుంది.

*సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తూం భీంసేన్ మూడువేల ఓట్ల మెజారిటీతో ఉండగా, సికింద్రాబాద్ టీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థి పద్మారావు దూసుకుపోతున్నారు. మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశాంతి వెనుకంజలో ఉండగా, టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి 7 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అటు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో జానారెడ్డి వెనుకబడగా, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు 11 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దపల్లిలో బాల్కసుమన్, మెదక్ లో కేసీఆర్, వరంగల్ లో కడియం శ్రీహరి, భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్, నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత తదితరులు లీడింగ్ లో ఉన్నారు.

*నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి కల్వకుంట్ల కవిత 9 వేల ఓట్ల ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ వెనుకంజలో ఉన్నారు. పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్ 5వేల ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వివేక్ కు సుమన్ గట్టిపోటీ ఇస్తున్నారు. మరోవైపు జనగాంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వెనుకంజలో ఉండగా, టీఆర్ఎస్ అభ్యర్థి యాదగిరి రెడ్డి 1500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పాలమూరులో టీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. మహబూబ్ నగర్, కొల్లాపూర్, జడ్చర్ల, అచ్చంపేట, గద్వాల అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ జోరుమీదుంది. గద్వాలలో మాజీ మంత్రి డీకే అరుణ వెనుకంజలో ఉన్నారు.

*కొల్లాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి వెనుకంజలో ఉండగా, గద్వాలలో కృష్ణమోహన్ రెడ్డి ఆధిక్యత కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. వరంగల్ లోక్ సభలో కారు దూసుకెళ్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి 10వేల ఓట్ల ఆధిక్యంలో ఆధిక్యంలో ఉన్నారు. అసెంబ్లీ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ జోరుమీదుంది.

*11 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. భద్రాచలంలో పలుచోట్ల కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, ఇల్లందు, పినపాక లలో కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అధికారుల నిర్లక్ష్యంపై పార్టీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. 543 ఎంపీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు, 17 ఎంపీ స్థానాలకు, సీమాంధ్రలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు లెక్కింపు ప్రారంభమయ్యింది.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *