త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తూ వస్తున్న తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో కూడా గులాబీ నేతలనే గెలిపించుకుని తెలంగాణ గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరేయనున్నారు. మార్చి 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహించిన ర్యాండమ్ సర్వే ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ కు 57.45% ఓటర్లు జై కొట్టారు. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ మినహా 16 నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సర్వేలో కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు తరిమికొట్టనున్నారని స్పష్టంగా తేలింది. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు మెజార్టీలు కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయని సర్వే ఫలితాలను బట్టి తెలుస్తున్నది. తెలంగాణ ప్రజానీకం టీఆర్ఎస్ కు 16 స్థానాల్లో విజయం కట్టబెట్టి రాష్ట్ర చరిత్రలోనే కొత్త అధ్యాయం లిఖించబోతున్నారని కూడా సర్వే స్పష్టం చేసింది.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం టీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించనున్నారని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేంద్రంలో టీఆర్ఎస్ కీలకస్థానంలో ఉండాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సర్వే తెలిపింది. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఇతర పార్టీల్లో ఎవరికి మీ ఓటు? ఎంపీగా ఎవరిని ఎన్నుకుంటారు? అని వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించగా.. టీఆర్ఎస్ కు, టీఆర్ఎస్ అభ్యర్ధులకే తమ మద్దతని ప్రజలు తేల్చిచెప్పారు. 16 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, వాటిలోని 6 నుండి 7 మండలాలు, వాటిలోని 7 నుండి 9 గ్రామాలు, కాలనీల్లో ర్యాండమ్ సర్వే ఈ అభిప్రాయ సేకరణ నిర్వహించింది. 345 మంది క్షేత్రస్థాయి సర్వేయర్లు, 25 మంది సూపర్వైజరీ ఆఫీసర్లు ఈ సర్వేలో పాల్గొని 1,88,616 మంది అభిప్రాయాలను సేకరించారు. అందులో 57.45% మంది టీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు 28%, బీజేపీకి 11.85%, లెఫ్ట్ పార్టీలకు 1.45%, ఇతరులకు 1.25% ఓటర్లు మద్దతుగా నిలిచారు.