ఏప్రిల్ 11న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడొక విషయం గమనించాల్సింది ఏమిటంటే ఇటీవల జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో సర్పంచులుగా గెలుపొందిన టీఆర్ఎస్ మద్దతుదారులు ఆ పార్టీ లోక్ సభ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చనున్నారా? అంటే అవుననే చెప్పాలి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే టీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్మెంట్ వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధిస్తామని టీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉండగా ప్రతిపక్ష నేతలు మాత్రం తీవ్ర నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. అసెంబ్లీ, గ్రామస్థాయి ఎన్నికల ఫలితాల వల్ల కలిగిన నైరాశ్యం, ఆ తర్వాతి పరిణామాలు వారిని ప్రచారంలో దూసుకెళ్ళకుండా అడ్డుకుంటున్నాయి. ఎన్నికలు ఏవైనా గ్రామస్థాయిలోని సర్పంచులు, పలు పార్టీల నేతలే కీలకంగా వ్యవహరిస్తారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు, ఓటర్లను పోలింగ్ బూత్ లకు తీసుకెళ్లడం, గ్రామస్థాయి నేతలతో సమన్వయం చేసుకుని తమ పార్టీకి ఎక్కువ ఓట్లు పోలయ్యేలా చూసుకోవడం లాంటి బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో లోక్ సభ ఎన్నికల్లో సర్పంచులు కీలకం కానున్నారు. లోక్ సభ పోలింగ్ గ్రామస్థాయిలో సజావుగా సాగాలంటే గ్రామాల్లో రాజకీయ పార్టీలకు సరైన యంత్రాంగం తప్పనిసరి. కొత్తగా ఎన్నికైన అధికార టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచిననాటి నుండి గ్రామాల్లో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధులకు సంబంధాలున్న నియోజకవర్గాలు, వారితో సంబంధం ఉన్న సర్పంచుల్లో కొంతమంది ఉత్సాహంగా ఉన్నా, మిగిలిన చోట్ల ఇంకా ఎన్నికల బరిలోకి సర్పంచులు పూర్తిస్థాయిలో దిగకపోవడం గమనార్హం!
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జహీరాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ లు 70% కు పైగా ఉండడం విశేషం! కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల్లో ఒకటి, రెండు చోట్ల మినహా 25% మించలేదు. కొన్నిచోట్ల ఇతరులు గెలుపొందినప్పటికీ అందులో కూడా చాలామంది టీఆర్ఎస్ కు అనుబంధంగానే కొనసాగుతున్నారు. దీన్నిబట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాలున్న 14 లోక్ సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ దే పై చేయి అవుతుందని తెలుస్తుంది. ఓటరును పోలింగ్ బూత్ కు తీసుకెళ్ళే యంత్రాంగం ప్రతిపక్షాల కంటే తమకు చాలా పెద్ద ఎత్తున ఉండడం కలిసి వస్తుందని, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గకుండా గ్రామీణ ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నామని టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి.
ఖమ్మం, భువనగిరి, నల్లగొండ, చేవెళ్ళ, మహబూబాబాద్ గ్రామీణ నియోజకవర్గాల్లో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకున్నప్పటికీ, సర్పంచుల మధ్య తేడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిబంధకం కానుంది. భువనగిరిలో కాంగ్రెస్ కన్నా రెట్టింపు స్థాయిలో టీఆర్ఎస్ సర్పంచులు ఉండగా, ఖమ్మంలో 55 శాతానికి పైగా టీఆర్ఎస్ మద్దతుదారులే సర్పంచులుగా గెలిచారు. చేవెళ్లలో 50%, మహబూబాబాద్ లో 63%, నల్లగొండలో 65% మంది టీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధించారు. పోలింగ్ కు మరో 10 రోజుల గడువు మాత్రమే ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్పంచుల్లో కదలిక లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి పోలయ్యే ఓట్లు బూత్ ల వరకు ఎట్లా వెళ్తాయన్నది ప్రశ్నార్ధకం!!