mt_logo

16 సీట్లివ్వండి.. దేశ రాజకీయ గమనం మార్చేస్తా- కేసీఆర్

తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారని? ఈ ఐదేండ్లలో దేశానికి కూడా ఆయన చేసింది ఏమీ లేదని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే 24 రూపాయలు కూడా ఇవ్వలేదని, గత ఎన్నికలప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తామని చెప్పి తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు. ఆదివారం మహబూబ్ నగర్, వనపర్తి జిల్లా నాగర్ కర్నూల్ నియోజకవర్గాల ఎన్నికల ప్రచార సభల్లో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తానేమోనని కాంగ్రెస్, బీజేపీలు వణికిపోతున్నాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని, మే 23 తర్వాత దేశంలో పాలనాపగ్గాలు చేపట్టేది ప్రాంతీయ పార్టీలేనని స్పష్టం చేశారు. బంగారు భారతదేశం కొరకు తన రక్తం ధారపోస్తానని, దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తానని కేసీఆర్ తేల్చిచెప్పారు.

రాష్ట్రానికి ఏం చేశారో మహబూబ్ నగర్ చౌరస్తాలో లెక్కలు ముందేసుకుని చర్చిద్దాం రావాలంటూ ప్రధాని మోడీకి కేసీఆర్ సవాల్ విసిరారు. ప్రధాని స్థాయిలో ఉండే వ్యక్తి ఇన్ని పచ్చి అబద్దాలు చెప్పవచ్చా? అని నిలదీశారు. ఇజ్జత్ పోయేలా మోడీ మాటలు ఉన్నాయని, ఐదేండ్లు పీఎంగా ఉన్న మోడీ ఓటు అడిగేముందు ఏం చేసిండో చెప్పడు.. ఏం చేస్తడో చెప్పడు.. అని ఎద్దేవా చేశారు. దేశంలో రైతుబంధు, రైతు బీమా పథకాలు ఎందుకు పెట్టలేదు? 24 గంటల కరెంట్ దేశంలో ఏ రాష్ట్రమైనా ఇస్తుందా? దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ.. అంగన్వాడీ అక్కచెల్లెళ్ళకు, ఐకేపీ, ఆశా వర్కర్లకు, హోంగార్డులకు భారతదేశంలోనే అత్యధిక జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఎకరానికి ఒక పంటకు రూ. 5 వేలు చొప్పున రెండు పంటలకు కలిపి రూ. 10 వేలు ఇచ్చుకునే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఎవరైనా రైతు సహజ మరణం అయినా, ఆక్సిడెంట్ ద్వారా అయినా చనిపోతే వారి కుటుంబాలకు ఎక్కడా తిరిగే అవసరం లేకుండా పదిరోజుల్లోపల రూ. 5 లక్షలు నామినీల ఖాతాల్లో జమ ఐతున్నయని కేసీఆర్ చెప్పారు.

గురుకుల స్కూళ్ళలో ఒక్కో విద్యార్ధిపై రూ.1.25 లక్షలు ఖర్చు పెడుతున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు ఓసీల్లోని పేదవారి పిల్లల కోసం రాష్ట్రంలో 550 గురుకులాలు పెట్టినం. మహిళలు, ఆడబిడ్డలు ప్రసవానికి పోతే కూలి డబ్బు పోతుంది కాబట్టి వారికి దేశంలో ఎక్కడా లేనివిధంగా “కేసీఆర్ కిట్లు” అందించాం. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ కాదా? అని ప్రశ్నించారు. ట్రాఫిక్ పోలీసుల బాధ గమనించి వారి జీతంలో 30% అదనంగా ఇస్తున్నాం. వారికి ఊపిరితిత్తులు చెడిపోతాయి కాబట్టి రిస్క్ అలవెన్స్ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ చూసి ఇతర రాష్ట్రాలు మాకు ఎందుకు ఇయ్యరు? తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది కదా అని అడుగుతున్నారు. 24 గంటల కరెంట్ తెలంగాణ రాష్ట్రం ఎట్ల ఇస్తున్నదో అని భారతదేశం ఆశ్చర్యపోతున్నది. మా రైతుబంధును నువ్వే కాపీ కొట్టావు కదా? మేమిచ్చేదెంత? మీరిచ్చేదెంత? మేము ఎందరికి ఇస్తున్నాం? మీరు ఎందరికి ఇస్తున్నారు? వాళ్ళు చెయ్యరు, దేశంలో ఎవరికైనా పేరొస్తే ఓర్వరు. ఈ మధ్య ఫెడరల్ ఫ్రంట్ స్థాపిస్తానని చెప్తున్న. కేసీఆర్ ఏమైనా ఢిల్లీ బయలుదేరుతాడా అని మోడీ, రాహుల్ కు భయం పట్టుకుందని కేసీఆర్ అన్నారు.

ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజల అభీష్టం గెలిచినప్పుడే దేశం బాగుపడతది. రైతులు జూన్ దాకా ఓపిక పట్టండి. ఎవరికీ లంచాలు ఇవ్వకండి. కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నాం. రైతులు మండలాఫీసులకు పోయే అవసరం లేకుండా, ధరణి అనే కొత్త వెబ్ సైట్ తెస్తం. గంటగంటకూ అప్ డేట్ ఐతది. టీఆర్ఎస్ రైతుపక్షపాత ప్రభుత్వం. రైతుల నోరు, రైతుల గొంతుక కేసీఆర్.. రైతు భూమి రైతుకే ఉండాలి. అందుకే అద్భుతంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని రాబోయే జూన్-జూలై నెలల్లో తెస్తం. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మహబూబ్ నగర్ ఎట్లుండే? ఇయ్యాల ఎట్లున్నది? వలసల జిల్లాగా ఉన్న ఈ జిల్లాలో పొలాలు ఇప్పుడు పచ్చపడుతున్నయి. జిల్లా తలరాత మారుతున్నది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి 57-58 శాతం ఓట్లతో రెండున్నర, మూడు లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడని సర్వే రిపోర్టు చెప్తుంది. మీరు ఆశీర్వదించి మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కు పంపాలని, మీ సేవలో ఇక్కడే పనిచేస్తారని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

వనపర్తిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే దేశ రాజకీయ గమనమే మారుస్తానని, లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ దుకాణాలు బంద్ అవుతాయని ఢిల్లీ నుండి రిపోర్టులు వస్తున్నాయని అన్నారు. కేంద్రంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తేనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకోగలుగుతామని, అప్పుడే పాలుగారే పచ్చని పొలాల పాలమూరు జిల్లా సాధ్యం అవుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో 14 స్థానాలకు గానూ 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించి పాలమూరు దెబ్బ ఏంటో మీరు చూపించారు. అంత గొప్ప విజయం ఇచ్చిన పాత మహబూబ్ నగర్ జిల్లా బిడ్డలందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీరిచ్చిన బలం ఎట్టి పరిస్థితుల్లో వృధా పోనివ్వం. ఎంత పట్టుదలతో తెలంగాణ తెచ్చుకున్నమో అంతే మొండి పట్టుదలతో కష్టపడి 20 లక్షల ఎకరాల్లో పాలుగారే పచ్చని పొలాల పాలమూరు జిల్లాను మనం చూడాలని వివరించారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి రాములుకు 56 శాతం ఓట్లు వస్తున్నయి. దాదాపు 2 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుస్తరని తేలింది. రాములును ఆశీర్వదించి పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *