నాగార్జునసాగర్ లో ఈరోజు నుండి టీఆర్ఎస్ పార్టీ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం గం. 4.30 ని.లకు బయలుదేరి రాత్రి 7 గంటలకు సాగర్ చేరుకున్నారు. హైదరాబాద్-సాగర్ రహదారిపై సీఎంకు పార్టీనేతలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. సాగర్ లోని విజయవిహార్ కు చేరుకున్న తర్వాత సీఎం కాన్ఫరెన్స్ హాలును, మంత్రుల బస కోసం ఏర్పాటు చేసిన గదులను పరిశీలించారు. అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వివిధ అంశాలకు సంబంధించి విస్తృత అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ శిక్షణా తరగతులు మూడు రోజులపాటు జరగనున్న విషయం తెలిసిందే. 2, 3, 4 తేదీల్లో ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం కాన్ఫరెన్స్ హాలులో పదిగంటలకు ప్రారంభసమావేశం ఉంటుంది. దీనికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ లింగ్డో, ప్రముఖ ఆర్ధికవేత్త హనుమంతరావు హాజరుకానున్నారు. కాన్ఫరెన్స్ హాలులో అంశాలవారీగా శిక్షణ తరగతులు కొనసాగుతాయి. రోజుకు ఐదు అంశాలపై శిక్షణ ఉంటుంది. ప్రతి అంశానికి రెండు గంటల సమయం కేటాయించనున్నారు. రాత్రి తొమ్మిది గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయని సమాచారం. రెండవరోజు ఉదయం 9 గంటలకే తరగతులు ప్రారంభం కానున్నాయని సమాచారం.
శిక్షణ తరగతుల సందర్భంగా నాగార్జునసాగర్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కోసం ప్రత్యేక లైన్ తీసుకున్నారు. భారీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. విజయవిహార్ లో సీఎం కేసీఆర్ కు, సరోవర్ లో మంత్రులు, జెన్కో అతిథి గృహంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బుద్ధవనం, యూత్ హాస్టల్, ప్రాజెక్టు హౌస్, ఇతర అతిథి గృహాలను వీఐపీల వెంట వచ్చిన వారికోసం కేటాయించారు.