టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలనుండి అనూహ్య స్పందన లభిస్తున్నది. అతి తక్కువ సమయంలో ఏ రాజకీయ పార్టీ చేయనివిధంగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 8,55,756 మంది క్రియాశీల సభ్యత్వం, 32,39,667 మంది సాధారణ సభ్యత్వం తీసుకున్నారు. మొత్తం కలిపి 40,95,423 మంది టీఆర్ఎస్ లో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. మరో 30,334 మంది ఆన్ లైన్ సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పటివరకు 53,43,810 సభ్యత్వ నమోదు పుస్తకాలు జారీ చేశారు.
మంత్రులు కేటీఆర్, పద్మారావు, జంట నగరాల అడ్ హక్ కమిటీ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో లక్డీకాపూల్ లో న్యాయవాదులు సభ్యత్వం తీసుకున్నారు. మరోవైపు టీఆర్ఎస్ భవన్ లో స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ పరిశీలకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరుల సమక్షంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, శుక్రవారం సాయంత్రంతో సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగియనుందని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభించిందని చెప్పారు. డాటా ఎంట్రీ ప్రక్రియ మూడు, నాలుగు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు, పుస్తకాలు, డాటాను 3,4 రోజుల్లో తెలంగాణ భవన్ లో అందించాలని రాజేశ్వర్ రెడ్డి సూచించారు.