mt_logo

చెరువుల దత్తతకు ముందుకొస్తున్న తెలంగాణ ఎన్నారైలు..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని, తమ గ్రామాల్లోని చెరువులను దత్తత తీసుకుంటామని అమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం(టీడీఎఫ్-యూఎస్ఏ) సభ్యులు మంత్రి హరీష్ రావుకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా మిషన్ కాకతీయకు తగిన ఆర్ధిక వనరులు సమకూరకపోతే ఎన్నారైలమంతా సహకరిస్తామని వారు చెప్పారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు బుధవారం అమెరికాలోని ప్రవాస భారతీయులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించగా టీడీఎఫ్ సభ్యులతో పాటు 600 మంది ఎన్నారైలు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ పౌరులు మిషన్ కాకతీయ పట్ల చూపిస్తున్న స్పందన అద్భుతంగా ఉందని, చెరువులను దత్తత తీసుకోవడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారని హరీష్ రావు వారికి తెలిపారు. మిషన్ కాకతీయపై ప్రచారం చేయాలని, కొన్ని చిన్న పుస్తకాలను ప్రచురించి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన తెలంగాణ ఎన్నారైలకు పంచిపెట్టాలని హరీష్ రావు టీడీఎఫ్ సభ్యులను కోరగా ఇందుకు టీడీఎఫ్ సభ్యులు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లో చెరువును దత్తత తీసుకుంటే తమ తల్లిదండ్రుల పేరిట స్మారకంగా ఈ కార్యక్రమం చేపట్టవచ్చా అని, ఎంతవరకు నిధులు ఖర్చు చేయాల్సి వస్తుందని తదితర అంశాలకు సంబంధించి ఎన్నారైలు మంత్రి హరీష్ రావును అడిగి తెలుసుకున్నారు.

టీడీఎఫ్ అధ్యక్షుడు విశ్వేశ్వర్ కల్వల(కరీంనగర్), సభ్యులు రామచంద్రారెడ్డి(మహబూబ్ నగర్), విజయ్ కుమార్(నల్గొండ) లు తమ ఊరి చెరువులను దత్తత తీసుకోనున్నట్లు, ఇంకా ఎంతోమంది తమ గ్రామాల చెరువులను దత్తత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే పూర్తి వివరాలు మంత్రి కార్యాలయానికి పంపిస్తామని చెప్పారు. జూలై నెలలో అమెరికాలో జరగనున్న తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు రావలసిందిగా టీడీఎఫ్ ఫోరం సభ్యులు మంత్రి హరీష్ రావును ఈ సందర్భంగా ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *