టీఆర్ఎస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్ర్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ఇసుకేస్తే రాలనంతగా మైదానం నిండిపోయింది. సాయంత్రం 6.45 నిమిషాలకు మంత్రులు జగదీష్ రెడ్డి, ఈటెల రాజేందర్ లతో కలిసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సభాస్థలికి వచ్చి నేరుగా అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనం ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం కృషి చేయాలని, రాష్ట్రంలో 80 శాతం బడుగు, బలహీన వర్గాలే ఉన్నారని, వారి కళ్ళలో వెలుగు వచ్చిన నాడే మనం తెచ్చుకున్న తెలంగాణకు సార్ధకత చేకూరినట్లని అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ మొఖం బంగారు నాణెంలా మెరవాలని, అదే నిజమైన బంగారు తెలంగాణ అని, తనది, తన టీమ్ ది కూడా అదే లక్ష్యమని చెప్పారు. తనకు ఇదితప్ప వేరే పని లేదని, ఇందుకోసం 24 గంటలూ పనిచేసి మీ కల సాకారం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాకారంలో గత 14ఏళ్లుగా జరిగిన అన్ని అంశాలనూ ముఖ్యమంత్రి గుర్తుచేస్తూ చేసిన ప్రసంగం యావత్ ప్రజానీకాన్నీ ఆకట్టుకుంది. తెలంగాణ పల్లెలలో ఇవ్వాళ్టికీ నా అక్కచెల్లెళ్ళు కుండలు, బిందెలు పట్టుకుని కిలోమీటర్ల దూరం పోతున్నారు. తెలంగాణలో ప్రతి లంబాడీ తండాలో, ప్రతి గోండు గూడెంలో, ఊరికి దూరంగా ఉండే బస్తీలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఖర్చుతోనే నల్లా కనెక్షన్ ఇచ్చి ఆ మంచినీళ్ళతోనే మీ పాదాలు కడుగుతా.. ఇయ్యకపోతే ఓట్లడగనని చెప్పా.. చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? ఏ పార్టీ అన్నా ఈ మాట చెప్పిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇవ్వాళ ఏ పద్ధతిలో మన కరెంట్ మంత్రి, కరెంట్ అధికారులు 24 గంటలు తిప్పలుపడి మీకు కరెంట్ అందిస్తూ ఉన్నారో, అదేవిధంగా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఖచ్చితంగా మంచినీళ్ళు తెచ్చి ఆ నీళ్ళతో ప్రజల పాదాలు కడిగి అభిషేకం చేస్తారని అన్నారు.
త్వరలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రెండు బెడ్రూంల ఇళ్ళు కట్టించే కార్యక్రమం మే నెల నుండి ప్రారంభం కాబోతోందని చెప్పారు. కేజీ టూ పీజీ పథకం నాకున్న పెద్ద కల.. కులం మతం లేకుండా అందరూ ఒకే పాఠశాలలో, ఒకే యూనిఫాం వేసుకుని, ఒకటే సిలబస్ లో చదువుకోవాలనే ఆకాంక్ష.. వచ్చే సంవత్సరం ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం.. కొద్ది రోజుల్లోనే పాలమూరు, నక్కలగండి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తామని, పాలమూరు ఎత్తిపోతల పథకంతో ప్రతి నియోజకవర్గానికి లక్ష చొప్పున 12 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే పూచీ నాదని కేసీఆర్ పేర్కొన్నారు. సంక్షేమంలో దేశంలో మనమే నంబర్ వన్ అని, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి కార్యక్రమాలు ఎవరూ అడగలేదని, ప్రజల సంక్షేమం కోసం తామే ఈరోజు ఆలోచన చేసి వారిని ఆడుకుంటున్నామని, వృద్ధులు, వితంతువులకు 200 రూపాయల పెన్షన్ ను రూ. 1000 గా చేశామని, బీడీ కార్మికులకు రూ. వెయ్యి జీవనభ్రుతి కల్పించడం ద్వారా వారు సంతోషంగా ఉన్నారని, వికలాంగులకు గత ప్రభుత్వాలు కేవలం రూ. 500 ఇస్తే ఇప్పుడు తమ ప్రభుత్వం దానిని రూ. 1500 కు పెంచామని చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని హైటెక్ చేశామని అన్నారు. తాగేందుకు మంచినీళ్ళు లేవు. గట్టిగా వర్షం పడితే కార్లు పడవలు ఐతయి. సరైన మార్కెట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మన నగరం మన గుండెకాయ.. ఇది విశ్వనగరంగా రూపొందాలి. రాబోయే రెండుమూడేళ్లలో అమెరికాలోని డల్లాస్, సింగపూర్, జపాన్ లను తలదన్నే రీతిలో హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతాను. మీరు నా వెంట నడవండి. కేసీఆర్ మాట అన్నాడంటే తప్పడు. కష్టపడి తెచ్చిన తెలంగాణ గుంట నక్కల పాలు కావొద్దు.. బంగారు తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని సూచించారు.
మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ దొరుకుతారంటే పోయి చెరువుల కాడ చూస్తే అక్కడ దొరుకుతారనే ఒక జోకు తెలంగాణలో చెప్తున్నారని, ఏ మంత్రి చూసినా, ఏ ఎమ్మెల్యే చూసినా తట్టలు మోసుకుంటూ మిషన్ కాకతీయలో పాల్గొంటున్నారన్నారు. ఇది మాటల సమయం కాదని, చేతల సమయం అని, వచ్చే మార్చి తర్వాత రైతులకు పగటిపూట 9 గంటల పాటు కరెంట్ ఇస్తామని, చీకటి పడ్డ తర్వాత రైతులు పొలం కాడికి పోవుడు లేదని, ఆటో స్టార్టర్లు అవసరం లేదని, ఆరునూరైనా, తల తాకట్టు పెట్టయినా సరే పొద్దటి పూట కరెంట్ తెచ్చి ఇచ్చే బాధ్యత తనదని కేసీఆర్ హామీ ఇచ్చారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని, సభను జయప్రదం చేసినందుకు సంతోషమని, టీఆర్ఎస్ అంటే ఏంటో, తెలంగాణ ప్రజల ఐక్యత ఏంటో మరొక్కసారి రుజువుచేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.