తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హడ్కో ఉత్తమ డిజైన్ అవార్డును అందజేసింది. హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతులమీదుగా రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా హడ్కో చైర్మన్ రవికాంత్ మాట్లాడుతూ, ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచినీటిని అందించాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఆదర్శనీయమని, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి పథకం ప్రారంభించలేదని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు అమలుకు హడ్కో పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందజేస్తుందని, రూ. 10వేల కోట్లను ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసిందని, ఈ విషయంపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని హడ్కో చైర్మన్ పేర్కొన్నారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ వాటర్ గ్రిడ్ పథకానికి రుణం మంజూరు చేసే విషయంలో హడ్కో చాలా సానుకూలంగా ఉందని, భగీరథ తపస్సులాంటి ఈ పథకానికి రూ. 10వేల కోట్లు రుణంగా అందించాలని హడ్కోను కోరామన్నారు. దేశంలో మరే రాష్ట్రం చేపట్టని రీతిలో తమ రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్టును చేపట్టిందని, ఈ పథకం ద్వారా నాలుగేళ్ళలో తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా రక్షిత మంచినీరు అందుతుందని చెప్పారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి కూడా కేంద్రం నుండి తగిన సహకారం ఉంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారని తెలిపారు.