గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ఉదయం కలిసి హైకోర్టును త్వరగా విభజించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి, కవిత, బూరనర్సయ్య గౌడ్, సీతారాం నాయక్ తదితరులు ఉన్నారు. గవర్నర్ ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టును తక్షణమే విభజించాలని, పునర్విభజన చట్టంలో ఈ విషయం స్పష్టంగా ఉందని అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో హైకోర్టు అంశాన్ని లేవనెత్తుతామని, రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిగా ఏర్పాటు కావాల్సింది హైకోర్టు అని చెప్పారు. దేశంలో నూతనంగా ఏర్పడ్డ ప్రతి రాష్ట్రానికీ వెంటనే హైకోర్టు ఏర్పాటు చేశారు గానీ, తెలంగాణ విషయంలో అలా జరగడం లేదని అన్నారు.
ఎంపీ కే కేశవరావు మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికీ హైకోర్టు అవసరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం గడిచినా హైకోర్టు విభజన జరగడం లేదన్నారు. రాజ్యాంగ బద్ధ సమస్యలు పరిష్కరించడం గవర్నర్ బాధ్యత. అందుకే గవర్నర్ ను కలిసి హైకోర్టు విభజనపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరామని తెలిపారు. హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేకే పేర్కొన్నారు. అనంతరం ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ హైకోర్టు విభజనపై మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకే ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాల్లోని సమస్యలను గాలికొదిలేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఏపీ సీఎం కు లేఖ రాసినా స్పందించడం లేదని, ఈనెల 21 నుండి జరిగే పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తామని అన్నారు. హైకోర్టు విభజనపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని వినోద్ స్పష్టం చేశారు.