mt_logo

వేయి ఎకరాల్లో యాదాద్రి అభివృద్ధి పనులు..

యాదాద్రి అభివృద్ధి పనులను వారం పది రోజుల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో సుమారు ఐదు గంటలపాటు యాదగిరి గుట్ట దేవస్థానం అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. ఆధ్యాత్మికత, ఆనందం, పచ్చదనం ఉండే విధంగా గుట్టను రూపుదిద్దాలని, యాదాద్రి అభివృద్ధి కోసం పుష్కలంగా నిధులు ఉన్నాయని, వరుసగా రెండు బడ్జెట్లలో ఇప్పటికే రూ. 200 కోట్లు కేటాయించామని కేసీఆర్ చెప్పారు. అంబానీ, టాటా, భెల్, జెన్కో వంటి సంస్థలు కూడా సుమారు రూ. 500 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

యాదాద్రి చుట్టూ 943.2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామని, మరో 100 ఎకరాలను సేకరిస్తామన్నారు. మొత్తం వెయ్యి ఎకరాల స్థలాన్ని జోనింగ్ చేసి లే అవుట్ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గుట్టపై 15 ఎకరాల స్థలం ఉందని, దీంట్లో 5 ఎకరాలు ప్రధాన గుడి కిందకు వస్తాయని, ఈ ఐదెకరాల్లో ప్రాకారం, మాడవీధులను నిర్మించాలని, లక్ష్మీ నరసింహస్వామి 32 అవతారాల ప్రతిమలు కూడా ఇందులోనే రావాలని సూచించారు. పుష్కరిణి, కళ్యాణకట్ట, అర్చకుల నివాస గృహాలు, క్యూ కాంప్లెక్స్, వీఐపీ అతిథి గృహం, వంటశాల నిర్మించాలని, గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా నిర్మించాలని సీఎం పేర్కొన్నారు.

యాదాద్రి సమీపంలోని బస్వాపూర్ చెరువును రిజర్వాయర్ గా మార్చాలని, అక్కడ బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయాలని, చెరువు కట్టను ట్యాంక్ బండ్ మాదిరిగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. యాదగిరి గుట్ట ప్రాంతమంతా నాలుగులైన్ల రోడ్లు వేయాలని, ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో నిండిపోవాలని అన్నారు. ఈ సమీక్షలో ఎంపీ బూరనర్సయ్య గౌడ్, మంత్రి జగదీష్ రెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, ఆర్కిటెక్ట్స్ జగన్, ఆనంద్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *