యాసంగి వరిసాగు, వరిధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యలను కేద్రం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం గురువారం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గురువారం టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నాతో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేశామని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ అసంబద్ధ విధానాల మూలంగా తెలంగాణ ప్రభుత్వానికి ధర్నా చేయక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులు సంతోషంగా ఉన్నారని, ఈ రాష్ట్ర గవర్నర్ గా ఇది మీరు సంతోషించాల్సిన అంశం అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందిస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులను అయోమయానికి గురిచేస్తుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమమే రైతులు, వాళ్ల సమస్యల చుట్టూ తిరిగిందని.. స్వంత రాష్ట్రంలో రైతులకు నష్టం కలిగితే ఎంత పెద్ద పోరాటానికైనా సిద్దం అని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ పాల్గొన్నారు.

