mt_logo

భారీ వలసలతో టీఆర్ఎస్ హౌస్ ఫుల్

గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే అన్ని పార్టీలనుండి భారీగా వలసలు రావడం, రాబోయే వారం రోజుల్లో మరికొంతమంది రానున్నట్లు అందిన సమాచారంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించడం ప్రస్తుతం వాయిదా వేసామని పార్టీ నేతలు తెలిపారు. ఖమ్మం జిల్లా వైసీపీ నేత జలగం వెంకట్రావ్, కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన పుట్ట మధు సోమవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జలగం వెంకట్రావ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలమైన శక్తిగా మార్చి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి చూపిస్తామని, ఖమ్మం జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పుట్ట మధు మాట్లాడుతూ, తెలంగాణలో సీమాంధ్ర పార్టీలకు స్థానం లేకుండా చేయాలనే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానని, కేసీఆర్ ద్వారానే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. రెండుమూడు రోజుల్లో ఖమ్మం జిల్లాలోని టీడీపీకి చెందిన కీలక నేత టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్ కు చెందిన ఒక ఎమ్మెల్యే, వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కొండా దంపతులు కూడా టీఆర్ఎస్ లోకి రావడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. వీరే కాకుండా మెదక్ జిల్లా నుండి టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన నాయకుడు కూడా టీఆర్ఎస్ లోకి రానున్నారు. వలసలపర్వం భారీగా కొనసాగడం, సీపీఐ, న్యూ డెమోక్రసీ పార్టీలతో పొత్తులపై అవగాహన కుదరకపోవడంతోనే జాబితాను వాయిదా వేయాల్సి వచ్చినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. టిక్కెట్లు ఖరారైన అభ్యర్థులకు మాత్రం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ప్రచారం ప్రారంభించుకోవచ్చని, గెలిచి రావాలని అన్నట్లు తెలిసింది. అయితే అభ్యర్థుల జాబితాపై కొన్ని ఛానళ్ళు, పత్రికల్లో వస్తున్న రకరకాల వార్తలను ఖండిస్తూ, పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి ఇంకా వారం రోజుల సమయం పడుతుందని పార్టీ నేతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *