mt_logo

గర్భిణీలకు మరో ప్రభుత్వ వరం.. ప్రభుత్వాసుపత్రుల్లో ఇకపై టిఫా స్కానింగ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గణనీయంగా శిశుమరణాల రేటు తగ్గించడానికి అనేక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు మరో వైద్య సదుపాయాన్ని సమకూర్చింది. గర్భస్థ శిశువులలో లోపాలు గుర్తించేందుకు చేసే ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ యంత్రాలు ఉన్నా వాటికి టిఫా స్కాన్‌ తీసే సామర్థ్యం లేదు. దీన్ని గుర్తించిన ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కొనుగోలుకు వెంటనే ఆదేశించడంతో ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల్లో టిఫా స్కానింగ్‌ సదుపాయం కలిగిన 53 అల్ట్రాసౌండ్‌ మెషీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులకు శిక్షణ కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో టిఫా స్కాన్‌కు రూ.1500 -2000 వసూలు చేస్తుండగా..  పేద ప్రజలకు ఈ భారం పూర్తిగా తప్పనున్నది.

అసలేంటి ఈ టిఫా ? :

అంతర్జాతీయ నివేదికలు, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 7 శాతం గర్భస్థ శిశువుల్లో లోపాలు ఉండే అవకాశం ఉన్నది. అంటే పుట్టే ప్రతి 100 మందిలో ఏడుగురు శారీరకంగా ఏదో ఒక లోపంతో పుడతారు. మేనరిక వివాహాలు, జన్యు సంబంధ లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, కొందరికి గర్భం దాల్చినప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, సరైన పోషకాహారం లేకపోవడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల శిశువుల్లో లోపాలు తలెత్తుతాయి. అయితే ఇందులో అత్యధిక శాతం ముందే గుర్తిస్తే నయం చేయగలిగేవే. ఇలాంటి లోపాలను ‘టిఫా స్కాన్‌’తో గుర్తించే అవకాశం ఉన్నది.

టిఫా స్కాన్‌ను కచ్చితంగా 18-20 వారాల మధ్య చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 22 వారాల వరకు కూడా చేస్తారు. ఈ స్కానింగ్‌లో గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలి వరకు ప్రతి అవయవాన్ని స్కాన్‌ చేస్తారు. మెదడు, కండ్లు, ముక్కు, నాలుక..ఇలా ప్రతి అంతర్గత అవయవాన్ని 3డీ, 4డీ ఇమేజింగ్‌ రూపంలో నివేదికలు తయారు చేస్తారు. నిపుణులైన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు మాత్రమే ఈ స్కాన్‌ చేస్తారు. ఇందుకు కనీసం 20-30 నిమిషాలు పడుతుంది. శిశువు గర్భంలో ఏ పొజిషన్‌లో ఉన్నది, జరాయువు/మావి (ప్లాసెంటా) ఏ ప్రాంతంలో ఉన్నది, ఉమ్మనీరు స్థితి వంటి వాటిని గుర్తిస్తారు. శిశువులో ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే అప్రమత్తమై సరిదిద్దే వీలు కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టగానే సర్జరీ చేయాల్సి రావొచ్చు. ముందే గుర్తించగలిగితే డెలివరీ సమయంలో పీడియాట్రిక్‌ సర్జన్లను అందుబాటులో ఉంచి ప్రాణాలు రక్షించవచ్చు. గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం వంటి లోపాలు గుర్తిస్తే ముందుగానే కుటుంబ సభ్యులను మానసికంగా సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శిశువుల ఎదుగుదల సరిగా లేక..పుట్టగానే చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలా నయంకాని వ్యాధులు, ఎక్కువ కాలం బతకలేని వ్యాధులను గుర్తిస్తే ముందుగానే న్యాయపరంగా అబార్షన్‌ చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. జరాయువు, బొడ్డుతాడు ఉన్న స్థితిని బట్టి సాధారణ ప్రసవానికి సాధ్యమా? సిజేరియన్‌ చేయాలా? అనేది నిర్ణయించవచ్చు.

నిత్యం వందలాది మంది వచ్చే ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ యంత్రాలు లేకపోవడంతో వారిని బయట చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించేది. ఆర్థికభారం కావడంతో పేదలు ఈ స్కానింగ్ తీసుకునేవారు కాదు. ఇకపై ఈ సమస్య తీరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *