దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ముగ్గురు నిందితులను ఎస్ఓటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతి ఉన్నారు. షేక్‌పేటలోని హిల్‌టాప్ అపార్ట్మెంట్లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని, సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలించారు. అనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ధర్మాసనాలు రెండు వేర్వేరు తీర్పులను వెలువరించాయి. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ. కోట్ల నగదు ఇస్తామంటూ ప్రలోభపెట్టడంపై నమోదైన కేసు దర్యాప్తును సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ పిటిషన్ వేయగా, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నవంబర్ 4 వరకు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. అలాగే సైబరాబాద్ పోలీసులు వేసిన మరో పిటిషన్లో.. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు అనుమతిస్తూ మరో ధర్మాసనం తీర్పును వెలువరించింది.
