mt_logo

దొంగలెవరో దేశం మొత్తం తెలిసింది : బీజేపీపై ధ్వజమెత్తిన మంత్రి కేటీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మనదేశంలో రాజకీయ పార్టీలు.. ప్రజలకు చేసిన, చేయబోయే మంచి గురించి చెప్పి ఓటు అడగాలి కానీ, తెలంగాణలో మాత్రం బీజేపీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‎లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ బీజేపీ వైఫల్యాలను ఎండగట్టారు.   

‘‘ప్రజలకు దొంగ ఎవరో అర్థమైంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయి. ఇప్పుడు మేం ఏం మాట్లాడినా వక్రీకరిస్తారు. పరిశోధన చేస్తున్న సంస్థలు సమాచారం ఇస్తాయి. మేం బాధ్యత గల వ్యక్తులం. చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తుంది. సందర్భానుసారంగా సీఎం, దర్యాప్తు సంస్థలు వివరాలు వెల్లడిస్తాయి. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడము. తొందర పడవద్దని మా పార్టీ నాయకత్వానికి చెప్పా. సమయానుసారం సీఎం అన్ని విషయాలు మాట్లాడతారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం అయితే కోర్టులు ఎందుకు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో స్వామి వారిని బండి సంజయ్ తాకారు. యాదాద్రి దేవాలయాన్ని సంప్రోక్షణ చేయాలని వేదపండితులను కోరుతున్నాను’’ అని కేటీఆర్ అన్నారు.

‘తెలంగాణలోని మునుగోడులో జరగబోయే ఉపఎన్నికలో మూడు పార్టీలు పోటీలు ఉన్నాయి. టీఆర్ఎస్ చేసిన పనులు, చేయబోయే పనుల గురించి చెబుతూ మేం ఓటు అడుగుతున్నాం. మాజీ శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి చేయని పనులను మేం చేస్తాం అని చెప్తున్నాం. కానీ బీజేపీ మాత్రం ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి.. ప్రజలకు ఎటువంటి మంచి చేయలేకపోయింది. అందుకే మునుగోడు ప్రచారంలో ఏం చెప్పలేకపోతుంది. బీజేపీ దుర్భుద్ధిని బయటపెట్టేందుకు మునుగోడు ప్రజల తరఫున చార్జ్ షీట్స్ విడుదల చేస్తున్నామన్నారు. 

చార్జీ షీట్ ముఖ్యాంశాలు :

* ఫ్లోరైడ్ బాధితులను పట్టించుకోనందుకు, ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుచేయనందుకు బీజేపీ మీద మొదటి చార్జీ షీట్.

* గతంలో 14 మంది ప్రధానులు చేయని తప్పు.. ఇప్పటి ప్రధాని మోడీ చేశారు. చేనేతల మీద జీఎస్టీ విధించడం, హ్యాండీక్రాఫ్ట్ బోర్డు రద్దు చేసినందుకు.. నేతన్నల తరఫున రెండో చార్జీ షీట్.

* రైతన్నలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటుంటే.. మోటర్లకు మీటర్లు పెట్టాలనుకుంటున్నందుకు, కరెంట్ సమస్యలు మళ్లీ తెచ్చేందుకు చూస్తున్నందుకు.. తెలంగాణ రైతన్నల తరఫున మూడో చార్జీ షీట్.

* వంట గ్యాస్ ధరను రూ. 400 నుంచి రూ. 1200 చేసినందుకు.. మా ఆడబిడ్డల తరఫున చార్జీ షీట్.

* ముడుచమురు ధర పెరగకపోయినా.. మోడీ చమురు ధర పెంచి.. పెట్రోల్, డీజీల్ ధరల పెంపుతో మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచినందుకు.. వారి తరఫున చార్జీ షీట్.

* బీసీ కులగణన చేయకుండా.. బీసీల మీద దొంగ ప్రేమ చూపిస్తున్న మోడీ ప్రభుత్వం మీద చార్జీ షీట్. 

* కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ.. పేదల సంక్షేమ పథకాలు పనికిరానివంటూ మోడీ చేస్తున్న వ్యాఖ్యలకు విరుద్ధంగా పేదల తరఫున చార్జీ షీట్.

* ఉద్యోగాల పేరుతో యువకులను మోసం చేస్తున్నందుకు యువత తరఫున చార్జీ షీట్.

* నల్లధనం తెస్తా అని చెప్పి.. పెద్ద నోట్లను రద్దు చేసి, సామాన్యులను కష్టపెట్టినందుకు సామాన్యుల పక్షానా చార్జీ షీట్.

* టీఆర్ఎస్ మీద కక్షతో.. విద్యార్థుల కోసం మెడికల్ కళాశాలలు మంజూరు చేయనందుకు విద్యార్థుల తరఫున చార్జీ షీట్.

* కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయనందుకు, విభజన చట్టానికి తూట్లు పొడిచినందుకు చార్జీ షీట్.

* నల్ల చట్టాల పేరుతో రైతన్న నోట్లో సున్నం పెట్టేందుకు ప్రయత్నించినందుకు, తెలంగాణ ప్రజలను నూకలు తినమన్నందుకు, రైతులను అవమానించినందుకు రైతుల తరఫున చార్జీ షీట్.

* 14 మంది ప్రధానులు చేసిన అప్పు 55 లక్షల కోట్లు అయితే.. ఒక్క మోడీ చేసిన అప్పు 105 లక్షల కోట్లు. పుట్టిన బిడ్డ మీద కూడా అప్పువేసినందుకు చార్జీ షీట్.

* దేశానికి లాభాలు తెచ్చే ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నందుకు చార్జీ షీట్.

ఇవన్నీ మచ్చుకు మాత్రమే.. ఇలా చెబుతూ చార్జీ షీట్ వేయాలంటే వందల కొద్ది ఉన్నాయి. శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత కృష్ణుడు శిక్షించినట్లు.. ప్రజలు కూడా మోడీని శిక్షిస్తారని భావిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *