mt_logo

థాట్ పోలీసింగ్ తొత్తు పలుకులు

-రమేశ్ హజారి

యిన్నోల్లెవలో.. యిననోల్లెవలో.. మల్ల మొదలయిందయో.. సీమాంధ్ర మీడియా థాట్ పోలీసింగ్.
మన మీద సీమాంధ్ర మీడియా థాట్ పోలీసింగ్ మల్ల మొదలయింది. యిది శాలా డేంజరు. ఆంధ్ర పత్రికలను ఊకెనే సదువుడు కాదు. బిట్వీన్ ద లైన్స్ సదువాలె. అని అనుకుంటున్నరు తెలంగాణ జనాలు. మొన్నటి తొత్తు పలుకు సదివినంక.

ఆంధ్ర పక్షపాత మీడియా గత ముప్ఫై యేండ్లనిం చి వార్తల పేరుతోని చేసిదే గీ పనే. వాల్లు ప్రచురించే వార్తలు మనకు వార్తలుగానే కనపడుతయి. వార్తలకు వాల్ల తొత్తు కతనాలకు తేడా తెలువనీయరు. వాట్ని ఓ పథకం ప్రకారం రాయిస్తరు. మిగతా పత్రికల్ల వార్తలు సదివంగనే అర్థమయితయి. కాని వీల్ల వార్తలు స్లో పాయిజన్. గంజాయి తాగినట్టు గంటసేపటి తర్వా త మన మెదడుకు యెక్కుతయి. మనల గందరగోళం చేస్తయి. మన పాణాన్ని మెలితిప్పుతయి. మాదక ద్రవ్యాలన్న నయం. మన మెదడును మొద్దుబారేటట్టు చేస్తయి. దీన్నే థాట్ పోలీసింగ్ అంటరు. పోలీసోడు దెబ్బలు కొడితే వొల్లుకు గాయమయితది.

కని వీల్ల వార్తల దెబ్బ లు మన మనసును తీవ్రంగ గాయం చేస్తయ్. అందుకే మనం ఆవేశం పట్టలేక వర్లుతుంటం. గాబట్టి వాల్ల పేపర్లను జర సముదాయించుకోని సదువాలె. కొన్నిసార్లు మనకు యీ థాట్ పోలీసింగ్ కొద్దిల మంచి చెప్పినట్టు గూడ అనిపిత్తది. అదింకా డేంజరు. తేనె బూసిన కత్తిని నాకినట్టే. మొన్నటి తొత్తు పలుకులు అసొంటియే… అని తెలంగాణ జనం అనుకుంటున్నరు.

వీల్ల థాట్ పోలీసింగ్ ఫార్ములా వన్స్ మోర్ సురవయింది. కావట్టి మనం యిగనించి జాగర్తగుండాలె.. అని డప్పు సాటింపు చేయించాలని సూత్తాం డ్రు వూల్లల్ల తెలంగాణ మేధావులు బుద్ది జీవులు.థాట్ పోలీసింగ్ ల గురించి తెలుసుకోవాలంటే డెంగ్యూ జరం పరీక్షల లెక్క కొన్ని పరీక్షలుంటయి. వాట్ని గుర్తిద్దానికి తెలంగాణ ఊర్లల్ల సీమాంధ్ర మీడి యా నుంచి రక్షణ కేంద్రాలను యేర్పా టు చేయాలని యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు యిప్పటికే మొదలయినయ్. పీపుల్స్ (సోషల్) మీడియా గ్రూపులనించి.. వీటికి సీమాంధ్ర డెంగ్యూ వార్తలు అనే పేరుతోని పిలుస్తున్నరు. సీమాం ధ్ర ప్రభుత్వాల తొత్తు పలుకులను పసిగట్టేందుకు కొన్ని సూచనలు యీ కింద అందజేయడం జరిగింది.

డెంగ్యూ వార్తల లక్షణాలు 1: సీమాంధ్ర పేపర్ల వార్త సదువంగనే.. పానం యేన్నో నులిపెట్టినట్టు ఉంటది. కాసేపట్లనే యేందో అయిందేందిర నాకు అనుకుంటం. గని మర్సిపోతం. మనం మర్సిపోవుడు జూసి యిగ అది మెదడుమీద పనిచేసుడు మొదలు పెడుతది. మీకు యెప్పుడయినా అట్ల జిమ్మన్నప్పుడు వెంటనే సీమాంధ్ర మీడియా డెంగ్యూ కాటు ప్రమాద తీవ్రత గురించి తెలిసిన తెలంగాణ సీనియర్ జర్నలిస్టులను సంప్రతించాలె. యిరుగుడు మందు చెప్తరు. యిటువంటి ప్రమాదం తెలంగాణ ఉద్యమ సమయంల తెలంగాణ జనాలకు మేదావులకు విద్యార్థులకు ఉద్యోగులకు చాలా మందికి జరిగింది .తెలంగాణ సోయితోని వెంటనే విరుగుడు మందు మింగుడం వలన సీమాంధ్ర డెంగ్యూ వార్తల ప్రమాదం తప్పింది. తెలంగాణను అడ్డుకునేందుకు బరితెగించి యీ పత్రికలు చానళ్లు చేసిన థాట్ పోలీసింగ్ దెబ్బలు యింకా మానలేదు. తల్సుకుంటెనే భయమైతది. యింకా మందులు వాడుతనే వున్నము.

నెంబర్ 2: యిది తెలంగాణ వచ్చినంక మొదలయింది. అమ్మా తెలంగాణ జనం మా పలుకులను పసిగట్టి యినకుంట బోతాండ్రే అని వులిక్కి పడి.. కొత్త పలుకుల పేరుతోని తొత్తు పలుకులు మెదలు బెడుతరు. మన మంచి గోరి చెప్తున్నట్టు బుదగరిచ్చుకుంట మొదలు బెడుతరు. అది సదివినంత సేపు యీ పలుకులల్ల జరంత తియ్యదనం వున్నట్టున్నది గదా.. అనిపించేటట్టు చేస్తది. కాని పేపరు మూసేసినంక అవి విషపు పలుకులని తెల్సిపోతయి. యీ తొత్తు పలుకుల అసలు మర్మం తెలిసిపోతది. యిన్నాల్లు యింకా యిప్పటికీ వీళ్లు రాయించే.. రాసే వార్తల మర్మం యాదికొస్తది. తెలంగాణ రాజధానిల వుండి ఆంధ్ర రాజధాని కొసురం విరాలాలు యియ్యం డి అని బ్యానర్ల వార్తలు యాదికొస్తయి.

నీల్లు లేక తెలంగాణ రైతులు సస్తుంటే రాస్తున్న వార్తలకు.. వరద తాకిడికి కూలిపోయిన సీమాంద్ర కొబ్బరి చెట్ల రైతుల మీద వొలకబోస్తున్న వార్తలకు గల పక్షపాతం యాదికస్తది. సీమాంధ్ర రాజకీయపు విషపు వారసత్వాన్ని యెట్లనైనా తెలంగాణ జనం మీద రుద్దాలనే ఆరాటం కనిపిస్తది. తెలంగాణను ఆఖరి నిమిషం దాక అడ్డుకున్న ఆంద్రబాబును యింకా యెనుకేసుకిచ్చుకుంట..

2019ల అధికారం కట్టబెట్టాలనే ఉబలాటం మనకు తెలిసిపోతది. అట్లా తొత్తు పలుకుల థాట్ పోలీసింగ్ పరాకాష్టకు చేరుకున్నది. రేవంతురెడ్డిని పెద్దోన్నిచేసి పచ్చపార్టీకి జీవిగంజి పోసే కుట్రలు.. తన మాట వినని తెలంగాణ జనాన్ని తప్పుపట్టే అవివేకం అన్ని తెలిసిపోతయి. యిప్పుడిప్పుడే తెలంగాణ జనం వాటిని బిట్వీన్ ద లైన్స్ సదివి వూకెనే దొరికిచ్చు కుంటున్నరు.

కెసీఆర్ నిర్ణయాలు అప్పటికప్పుడే తీస్కుంటడట. తెలంగాణను ఆగం జేస్తడట. యీనె మనకు చెప్తాండు.. అని జనాలు అనుకుంటాండ్రు. మం చి చెడులు యేమన్న వుంటె తెలుసుకునేంత తెలివి మాకు లేదని తొత్తు ప్రగల్భాలు పలుకుతాండు అని అనకుంటున్నరు.అసలు తెలంగాణ ప్రజల బాగోగు లు మాట్లాడేటందుకు వీల్లకున్న అర్హతేంది? హంతకులే సంస్మరణ సభలు పెట్టినట్టున్నది అని ఓ తెలంగాణ పెద్ద మనిషి పొద్దునట్టు చెప్పుకుంట బాధ పడుతాండు. యింకా ఆయన యేమంటడంటే.. సీమాంధ్ర తొడేల్లు పీక్క తిన్నంక కొసవూపిరితోటి వున్న తెలంగాణ జింకను అటిటు కదులకు.. నేను కూడ యింత పీక్క తినాలె అన్నట్టు బుదగరిచ్చినట్టున్నది ఆదివారం నాటి తొత్తు పలుకు అని అన్నడంటే యిగ సూడున్రి యీ తొత్తుపలుకుల కత. యిప్పుడిప్పుడే స్వరాష్ట్రంలో స్వయం పరిపాలన అనే సోయి తెచ్చుకుంటున్న మనల మల్ల పక్కదారి పట్టిచ్చే కుట్రలు చేస్తున్నరు సీమాంధ్ర మీడియా యాజమాన్యాలు అని మండి పడుతాండ్రు.

మంచయినా చెడయినా మేం మేం తిట్టుకుంటం.. కొట్టుకుట్టం.. మెచ్చుకుంటం.. తప్పులు జరుగుతే సరిదిద్దుకుంటం.. అంతేగని మీ అసొంటి దొంగ పిల్లులకు తీర్పు చెప్పే అవకాశమియ్యం.. యింటి దొంగలను జొర్రనియ్యం.. ఇస్తే కత మల్ల మొదటికస్తది. మల్ల సమైక్యరాష్ట్రమే మంచిగున్నదనే తొత్తు పలుకులకు గూడ యెనుకకుపోరు మీరు. మీ బరితెగింపు అట్లుంటది.. అని సెర్రున మండుతుండ్రు జనం. అందుకే తెలంగాణ అంత ఒక్కతాటిమీదుందాం. సీమాంధ్ర మీడియా థాట్ పోలీసింగ్‌ను అడ్డుకుందాం. సీమాంధ్ర మీడియా కో హటావో.. తెలంగాణ కో బచావో అని తెలంగాణ ప్రజలు మల్ల ఓ ఉద్యమాన్ని సీమాంధ్ర మీడియా కుట్రలకు వ్యతిరేకంగా మొదలు బెట్టేందుకు సిద్దమయితాండ్రు. యీ తొత్తు పలుకుల సంగతేందో సూద్దామని గోషి బిగిత్తాండ్రు..

Source: Namasthe Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *