mt_logo

ఈ మహా యుద్ధం ఆరంభం మాత్రమే : రైతు మహాధర్నాలో సీఎం కేసీఆర్

అద్భుత‌మైన పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ‌ రైతాంగం ప్ర‌యోజ‌నాల‌ను ర‌క్షించుకోవాల‌ని ఈ మహాధర్నాను ప్రారంభించామని సీఎం కేసీఆర్ తెలిపారు. గురువారం ఇందిరా పార్క్ వ‌ద్ద టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మ‌హాధ‌ర్నాలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘హైద‌రాబాద్ న‌గ‌రంతో ప్రారంభ‌మైన ఈ మహా ఉద్య‌మం ఇక్క‌డితో ఆగ‌దని, అవ‌స‌ర‌మైతే ఢిల్లీ వ‌ర‌కు కూడా యాత్ర చేయాల్సిన ప‌రిస్థితి ఉందని, ఎక్క‌డిదాకా అయినా స‌రే పోయి మ‌న ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ర‌క్షించుకోవాలన్నారు. తెలంగాణ అంటేనే పోరాటాల, విప్ల‌వాల గ‌డ్డ‌ అని, తమను తాము ఎలా ర‌క్షించుకోవాలో తెలుసని, ప‌రాయి పాల‌కుల విష కౌగిలి నుంచి బ‌య‌ట‌ప‌డి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఒక అద్భుత‌మైన ప‌ద్ధ‌తిలో ముందుకు పోతున్నామన్నారు. తెలంగాణ రైతాంగానికి అశ‌నిపాతంలాగా ఈ కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు దాప‌రిస్తున్నాయని, వాటిని ఎదుర్కొని కేంద్రం కండ్లు తెరిపించ‌డానికే ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టామన్నారు’.

‘ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిపిన ధ‌ర్నాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చున్నారని, ఊరికే ప్ర‌భుత్వం ధ‌ర్నాకు కూర్చుంటుందా? అని ప్ర‌శ్నించారు. 2006లో గుజ‌రాత్ సీఎం, నాటి ప్ర‌ధాని మోదీ 51 గంట‌లు సీఎం హోదాలో ధ‌ర్నాకు కూర్చున్నారు, ఆయ‌న పీఎం అయిన త‌ర్వాత ధ‌ర్నాలు చేసే ప‌రిస్థితులు క‌ల్పించారు. సీఎంలు, మంత్రులు ధ‌ర్నాలో కూర్చునే ప‌రిస్థితి మోదీ విధానాల వ‌ల్ల‌నే వ‌చ్చిందని దుయ్యబట్టారు. కేంద్రం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తే ధ‌ర్నాల అవ‌స‌రం ఉండ‌దని లేదంటే ఈ పోరాటం భ‌విష్య‌త్‌లోనూ కొన‌సాగుతోందని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *