mt_logo

ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుంది : మంత్రి హరీష్ రావు

భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీష్ రావు పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ఏర్పాటైన ఒక సంవత్సర కాలంలోనే 10 లక్షల పైబడి లావాదేవీలు ధరణి ద్వారా జరిగినట్లు తెలిపారు. బుధవారం ధరణిపై మంత్రివర్గ ఉపసంఘం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో నిర్వహించిన సమావేశానికి మంత్రి టి.హరీశ్ రావు అధ్యక్షత వహించగా… ధరణి పోర్టల్ లో ఎదురవుతున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించుటకు ధరణి మాడ్యూల్స్ లో చేయాల్సిన మార్పుల గురించి చర్చించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములపై 98,049 దరఖాస్తులు రాగా, వాటిలో 82,472 దరఖాస్తులను డిస్పోజ్ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించగా.. భూ రికార్డుల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు అనువైన మాడ్యూల్స్ ను త్వరగా అందుబాటులోకి తేవాలని హరీష్ రావు అధికారులను కోరారు.

ధరణి పోర్టల్ లో ఎదుర్కొన్న పలు సమస్యలను పరిష్కరించుటకు అనువైన మాడ్యూల్స్ ను, ఆప్షన్స్ ను పొందుపరచామని, అయితే ఈ మాడ్యూల్స్ పట్ల సరైన అవగాహన లేనందున సమస్యలు పరిష్కారం కావడంలేదని మంత్రి అభిప్రాయంపడ్డారు. ధరణి పోర్టల్, మాడ్యూల్స్, ఆప్షన్స్ పై అధికారులు మీసేవ ఆపరేటర్లకు జిల్లా స్థాయిలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాలకు జిల్లా కలెక్టర్లు హాజరై ధరణి గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు, అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టరెట్ లలో ధరణిపై అవగాహన కల్పించేందుకు హెల్ప్ డెస్క్ లను నెలకొల్పడంతో పాటు… దరఖాస్తులను అప్ లోడ్ చేసెందుకు అనువుగా మీసేవా కేంద్రాలవలే పనిచేయుటకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సూచించారు. వచ్చే వారంలో మంత్రివర్గ ఉపసంఘం మళ్ళీ సమావేశంకానుందని, చర్చించిన అంశాలపై అనువైన టెక్నికల్ మాడ్యూల్స్ ను వెంటనే రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి టి. హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *