mt_logo

ప్రారంభమైన నాగోబా మహా జాతర

గోండు గిరిజనుల ఆరాధ్య దైవమైన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా మహా జాతర మొదలైంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా మహా జాతర మొదలైంది. సోమవారం రాత్రి మెస్రం వంశీయులు నాగోబాకు పూజలు చేసి జాతరను ప్రారంభించారు. ఉదయమే మర్రి చెట్టు విడిది వద్ద ఉన్న కోనేరు నుంచి మహిళలు, పురుషులు సంప్రదాయ వాయిద్యాలతో ఆలయానికి చేరుకున్నారు. వారి వెంట పవిత్ర గోదావరి జలాలు తెచ్చిన మెస్రం వంశీయులు కటోడ కోసేరావు, పీఠాధిపతి వెంకట్‌రావు ఆధ్వర్యంలో ఆలయ వెనుక భాగంలో కలశాన్ని కింద పెట్టకుండా రెండు కట్టెలను కట్టి భద్రపరిచారు. రెండు రోజుల క్రితం సిరికొండ నుంచి తెచ్చిన కొత్త కుండలకు పూజలు చేసి మహిళలకు అందజేయగా, ఆ కుండల్లో మర్రి చెట్టు వద్ద ఉన్న కోనేరు నీటిని నింపుకొని ఆలయ శుద్ధి చేశారు. ఆ తర్వాత హస్తిన మడుగు నుంచి తెచ్చిన గోదావరి పవిత్ర జలాలతో నాగోబాకు మహా అభిషేకం నిర్వహించారు. అనంతరం మెస్రం ఆడపడచులు, అల్లుళ్లు ఆలయంలోని పాత పుట్టను తవ్వి కొత్త పుట్టను తయారు చేశారు. ఆ పుట్ట నుంచి సేకరించిన మట్టితో ఏడు దేవతల ప్రతిమలు ఉండల రూపంలో రూపొందించి.. ఆలయంలో సతీ దేవతగా పూజలు నిర్వహించారు. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి, ఐటీడీఏ పీవో అంకిత్‌, ఆర్డీవో జాడి రాజేశ్వర్‌లు నాగోబా మహా పూజకు హాజరయ్యారు. కాగా, గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఏటా నిర్వహించే దర్భార్‌ను కరోనా నేపథ్యంలో ఈసారి రద్దు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *