mt_logo

తెలుగు సినిమా వైఖరికి కారణం దాని పెట్టుబడి మూలాలే

By: నారాయణస్వామి వెంకటయోగి

చాలా మంది మిత్రులు మొన్న నేను రాసిన “కోస్తాంధ్ర సినిమా విముక్తి చేసిన హైదరాబాద్ “ చదివి “యెవడు చూడమన్నాడు ఇన్ని తెలుగు సినిమాలు?” “యింత సమయముందా నీకు వేస్టు చేసుకోవడానికి” “యెవడు తొక్కమన్నాడు బురద యెందుకు కడుగుతావు కాలు” అని మందలించారు.

హతవిధీ! నేను రాసిందాన్ని బట్టి నేనేదో తెలుగు సినిమాకి, తెలుగు సినిమా హీరోల హుంకరింపుల, వికట్టాట్టహాసాల, తొడకొట్టుడులకు వీరాభిమానినని, మహరాజపోషకున్నని అపార్థం చేసుకుని నన్ను సున్నితంగా మందలించారు!

నేను రాసింది ముఖ్యంగా గత 30 యేండ్లుగా (అంటే సుమారుగా యెప్పటినుంచో విజ్ఞలందరికీ అర్థమయ్యే వుంటుంది) తెలుగు సినిమా మన జ్ఞానం మీద, మన సున్నితత్వం మీదా, మన భావోద్రేకాల మీద, మన కనీస మానవ సహజాతాల మీద యెట్లా ఒక పద్దతి ప్రకారం భీకరమైన దాడి చేస్తూ వస్తుందో ఒక ‘మాంఛి’ కథ ద్వారా చెప్ప చూసాను.

అది మీకు ‘డే జావూ’ కావచ్చు. నిజానికి దాదాపు అన్ని తెలుగు సిన్మాలు ‘డే జావూ ‘ లే! అట్లా దాడి చేస్తూ వస్తున్న తెలుగు సినిమాలు మనని అన్ని సహజమైన human emotions కూ వీలైనంత దూరం చేసి మనల్నో ఆలోచించలేని మూర్ఖుల్ని చేయడానికే కంకణం కట్టుకున్నాయి. అట్ల్ల చేసే పద్దతి రోజు రోజుకూ మరింత వల్గర్ గా చేస్తున్నయి కూడానూ! దానికి కారణం వాటి వెనుక ఉన్న పెట్టుబడి, ఆ పెట్టుబడికున్న మూలాలూ, దానికున్న విపరీతమైన అక్రమ ధనార్జనాకాంక్ష కారణాలని నేననుకుంటున్నాను.

అయితే ఈ రాజకీయార్థిక ప్రయోజనాలతో పాటు, motives తో పాటు, తెలుగు సినిమా ప్రత్యేకంగా కోస్తాంధ్ర సంస్కృతినీ, భాషనూ మొత్తం తెలుగు జాతి మీద రుద్దాలని చూసింది! దానికిఇ కారణం ఆ పెట్టుబడి అక్కడి నుండి రావడం వల్ల కావచ్చు! అట్లే తెలంగాణ మీద ముఖ్యంగా హైదరాబాద్ మీద తన తిరుగు లేని ఆధిపత్యాన్ని స్థాపించాలని, కోస్తాంధ్ర లో ఉత్పత్తి ఐ అన్ని రంగాలలోకి (సినిమాతో సహా) diversify అయి విపరీతమైన లాభాలనార్జించిన అదనపు విలువ వల్ల బలపడ్ద ‘కొత్త’ ధనిక వర్గం అప్పుడే తన చేత చిక్కిన రాజకీయ అధికార పగ్గాలను చేతబట్టి దండయాత్రకు దిగింది. హైదరాబాద్ పై తన ఆర్థిక, రాజకీయ , భాషా, సాంస్కృతిక అధికారాన్ని (ప్రభుత్వ పరంగా, ప్రభుత్వేతరంగా) స్థాపించింది. అట్లా స్థాపించడానికి తెలుగు సినిమా చాలా సహకరించింది. అందుకే తెలుగు సినిమాల్లో పదే పదే తెలంగాణా విలన్లపై కోస్తాంధ్ర హీరో గెలుపు సాధించి పాదాక్రాంతం చేసుకోవడం, తెలంగాణ కమేడియన్ హీరోకి జేజేలు పలకడం పదే పదే చూపించి అదే నిజమేమో అని తెలంగాణ ప్రజలే నమ్మి ఆయా హీరోలకు నీరాజనాలు పట్టేటట్టు చేసుకున్నారు. అట్లా తెలుగు సినిమాని తమ కనుసన్నల్లో నడిపించింది కోస్తాంధ్ర ‘కొత్త’ ధనిక వర్గం. ఇందులో తెలంగాణ producers, distributors కూడా దాసోహమని లాభాల కోసం పాలుపంచుకున్నారు కూడా! ఫలితం systematic గా systemic గా తెలుగు సినిమా తెలంగాణ భాషని సంస్కృతిని విధ్వంసం చేసింది. అయితే పోరాట వార్సత్వం గల తెలంగాణ ప్రజలు తమ భాషనూ సంస్కృతినీ ఇతర అనేక రూపాల్లో కాపాడుకున్నారు.

ఇవాళ్ల సమైక్యాంధ్ర పేరు మీద జరుగుతున్న విన్యాసాలన్నీ ఒక typical తెలుగు సినిమాని గుర్తు తెస్తున్నయి – ఇవాళ్ల సమైక్యాంధ్ర పేరు మీద జరుగుతున్నది కోస్తాంధ్ర పెత్తందార్ల ఆధిపత్యం నిలపడానికి జరిగే కుట్ర తప్ప మరోటి కాదు అని స్పష్టంగా అర్థమవుతున్నది. అట్లా తెలుగు సినిమాని ఉదహరించవలసి వచ్చింది కానీ నేను ఎడాపెడా తెలుగు సినిమాలు చూసి ధమాక్ ఖరాబ్ చేసుకున్న వాడిని మాత్రం కాదు సుమా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *