తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని, తెలంగాణ సాధించిన కేసీఆర్ మరో తెలంగాణ మహాత్ముడని, తెలంగాణలో కేసీఆర్ ఒక్కరే లీడర్ అని, టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే పార్టీ అని స్పష్టం చేశారు.
సోమవారం మెదక్ జిల్లా పటాన్ చెరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో సహా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సోమిరెడ్డి, నరేంద్రనాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ, మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం ఎప్పుడో ఖాయమైందని, ఆంధ్రా సీఎంలకు ఊడిగం చేసిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు జగ్గారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలకు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.
ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ, జగ్గారెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి వస్తుందని టీడీపీ నేత ఎర్రబెల్లి ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని, తెలంగాణ నుండి గెలిచిన ఒక్కగానొక్క ఎంపీ దత్తాత్రేయకే మంత్రి పదవి దిక్కులేదు కానీ జగ్గారెడ్డికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నూతన ఒరవడితో సీఎం కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని, దళితులకు భూ పంపిణీ, సమగ్ర సర్వే, కళ్యాణ లక్ష్మి పథకం, గోల్కొండ కోటపై స్వాతంత్ర్య వేడుకలు అందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పేర్కొన్నారు.