mt_logo

కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం – హరీష్ రావు

త్వరలో జరగబోయే మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా ములుగు, వర్గల్ మండలాల్లో సోమవారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీకి అభ్యర్థిని నిలబెట్టడానికి దిక్కులేకే తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి టిక్కెట్ ఇచ్చారని, టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలపడం మరీ విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

కేంద్రం ఇప్పటికీ తెలంగాణకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తుందని, మెదక్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిఒక్కరూ కృషి చేసి కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని, ప్రభాకర్ రెడ్డిని గెలిపించడం ఎంత ముఖ్యమో జగ్గారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలకు డిపాజిట్లు రాకుండా చేయడం అంతకంటే ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు పోతున్నారని, రైతులకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ములుగు, వర్గల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన దాదాపు 300 మంది కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *