mt_logo

తెలంగాణలో ఏర్పడేది టీఆర్ఎస్ ప్రభుత్వమే- కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ సోమవారం కరీంనగర్, మెదక్ జిల్లాల్లో 10చోట్ల భారీ బహిరంగసభలు ఏర్పాటుచేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై అన్నిచోట్లా తనదైన ప్రసంగం చేసి అందర్నీ ఆకట్టుకుంటున్నారు. కేసీఆర్ ప్రసంగం ఇలా ఉంది. ‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని, వారి కలలు కల్లలుగానే మిగిలిపోతాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 20నుంచి 30సీట్లకు మించి రావని, త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని, బంపర్ మెజార్టీతో తెలంగాణలో ఏర్పడే మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చాక తన ఆస్తులపై విచారణ జరిపిస్తానన్న పొన్నాలపై కేసీఆర్ మండిపడ్డారు. తన ఆస్తులపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, దమ్ముంటే విచారణ జరుపుకోవచ్చని, అవాకులు చెవాకులు మాట్లాడితే ఊరుకోనని ఘాటుగా విమర్శించారు. పొన్నాల టీపీసీసీ అధ్యక్షపదవిని డబ్బులిచ్చి కొనుక్కున్నాడని, డబ్బులు తీసుకుని టిక్కెట్లు అమ్ముకున్నాడని సొంత పార్టీ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ వనరులను సీమాంధ్ర నేతలు దోచుకోవడానికి సహకరించింది తెలంగాణ కాంగ్రెస్ నేతలే అని విమర్శించారు.

ఉపముఖ్యమంత్రి పదవి మైనార్టీలకు ఇస్తానని తాను ఇంతకుముందు చెప్పానని, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డిప్యూటీ సిఎం పదవితోపాటు రెండుమూడు మంత్రి పదవులుకూడా మైనార్టీలకు కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగులలానే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఉంటాయని, మూడేళ్ళలో కరెంటు కష్టాలు తొలిగిపోతాయని, అధికారంలోకి రాగానే 15వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేస్తామని, తద్వారా వేలసంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని, వ్యవసాయానికి ఎల్లవేళలా విద్యుత్ సరఫరా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.

మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్నీ అమలయ్యేలా చూస్తామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి కారు గుర్తుకే ఓటువేసి ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించాలని, చిన్న పొరపాటు జరిగినా భావితరాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభకు హాజరైనవారిలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్ కుమార్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్, పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు, జేఏసీ కన్వీనర్ రాజమౌళి, కవి నందిని సిద్ధారెడ్డి, దుబ్బాక మాజీ సర్పంచ్ శ్రీరాం రవీందర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *