మెదక్ జిల్లా దుబ్బాకలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభ కొద్దిసేపటిక్రితం మొదలైంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలో భాగంగా సభాప్రాంగణం మొత్తం గులాబీమయమైంది. కేసీఆర్ మాట్లాడుతూ, దుబ్బాకతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగిందని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దుబ్బాక నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు సమస్యలు లేకుండా చేస్తానని, సిద్ధిపేట తరహాలో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సీమాంధ్రుల పాలనలో మనకు మిగిలినవి కన్నీళ్ళే కానీ, నీళ్ళు కాదని, నీటిపథకాల నిర్వహణను తాను చిన్ననాటినుండి చూస్తున్నానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే తడకపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మించి నియోజకవర్గం తాగునీరు, సాగునీరు సమస్యను తీరుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
మరోవైపు మానకొండూరు(మం) తిమ్మాపూర్ లో టీఆర్ఎస్ బహిరంగసభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధినేత కేసీఆర్ రాకకోసం భారీ సంఖ్యలో జనం బారులుతీరారు. పలుపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ సభవద్దకు చేరుకోగానే టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికి జైతెలంగాణ నినాదాలు చేశారు.
కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణను ఉత్తపుణ్యానికి ఎవరూ ఇవ్వలేదని, ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. మానకొండూరులో అనేక సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలన్నీ తీరాలంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ కు, ఎంపీగా వినోద్ కు ఓటువేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలని, సీమాంధ్రుల పాలన ఇన్నేళ్ళూ చూశామని, ఈ సమయంలోనే జాగ్రత్తగా ఉండి తెలంగాణ అభివృద్ధికి పాటుబడే వారికే అధికారం అప్పగించాలని, బంగారు తెలంగాణ సాధించాలంటే టీఆర్ఎస్ కే ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్ కోరారు.