ఉద్యోగుల విభజనలో స్థానిక రిజర్వేషన్లు పాటించాలని, కాని పక్షంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఎన్నో పోరాటాలు చేసి 371డీ, స్థానిక రిజర్వేషన్లు, రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించుకున్నారని, విభజన విషయంలో వారి హక్కులకు భంగం కలిగితే మరో ఉద్యమానికి సిద్ధమని ఆయన హెచ్చరించారు. మంగళవారం జేఏసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని, గిర్ గ్లానీ కమిషన్ సిఫారసులలో స్థానిక ఉల్లంఘనలపై తీవ్ర వ్యాఖ్యలు ఉన్నాయని, 126 రకాల ఉల్లంఘనలు జరిగినట్లు సమాచారం ఉందని, మళ్ళీ తెలంగాణ ఉద్యోగులు నష్టపోకుండా విభజన సందర్భంలో అందులోని సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని కోదండరాం కోరారు.
జేఏసీ కో చైర్మన్ సీ విఠల్ మాట్లాడుతూ 76వేల పోస్టులను విభజించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసిందని, వాటిలో ఏమన్నా ఉల్లంఘనలుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా నియమించబడ్డ వారిని స్థానికత ఆధారంగా అవశేష ఆంధ్రప్రదేశ్ కు పంపించాలని డిమాండ్ చేశారు. విభజనలో పక్షపాత ధోరణి ఉండకుండా ఉండేందుకు ప్రతీ శాఖలోని ఉద్యోగుల విభజన ప్రక్రియను వెబ్ సైట్లలో పొందుపరచాలని, ఆయా శాఖల నోటీస్ బోర్డులలో కూడా ఉంచాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ జీ వెంకటరెడ్డి, కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్, అధికార ప్రతినిధులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
