mt_logo

అనిల్ గోస్వామిని కలిసిన దేవీప్రసాద్ బృందం

మంగళవారం లేక్ వ్యూ అతిధిగృహంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ పలువురు సభ్యులతో వెళ్లి కలిశారు. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాల జారీలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దని అనిల్ గోస్వామికి విజ్ఞప్తి చేస్తూ ఒక వినతి పత్రం అందజేశారు. 610 జీవో, గిర్ గ్లానీ కమిషన్ లోని అంశాలను విభజనకు సంబంధించిన మార్గదర్శకాల్లో తీసుకోవాలని వినతిపత్రంలో సూచించారు.

తర్వాత దేవీప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ, సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఆలస్యమైన కొద్దీ సీమాంధ్ర ఉద్యోగులు కుట్రలు చేస్తూనే ఉంటారని, వెంటనే మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా ఉండాలని గతంలో గిర్ గ్లానీ కమిషన్ సిఫార్సు చేసిందని, ఎక్కడి ఉద్యోగులు అక్కడే అంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

తప్పుడు సర్టిఫికెట్లతో కొంతమంది సీమాంధ్ర ఉద్యోగులు, అధికారులు తెలంగాణలోనే పాతుకుపోదామని చూస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని దేవీప్రసాద్ కోరారు. సీమాంధ్రులు కొందరు తెలంగాణ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పొన్నాల లక్ష్మయ్య సీమాంధ్రకు చెందిన ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించారని, తెలంగాణలో ఉన్న అన్ని హెచ్ వోడీలలో నూటికి నూరు శాతం తెలంగాణ ఉద్యోగులే ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యోగులను విభజనలో భాగంగా సీమాంధ్రకు పంపొద్దని, తెలంగాణలో ఖాళీలు ఉంటే సీమాంధ్ర నుంచి డిప్యుటేషన్లను అనుమతించొద్దని దేవీప్రసాద్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *