తెలంగాణ రాష్ట్రం అభివృద్ధితోపాటు సుస్థిరపాలనలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఎదిగిందని బెంగళూరుకు చెందిన పరిశోధన సంస్థ ‘పబ్లిక్ అఫైర్స్ సెంటర్’ ఈ ఏడాది విడుదలచేసిన ‘పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్-2021’(పీఏఐ)లో ప్రకటించింది. అలాగే సుపరిపాలలో దేశంలో మూడోస్థానంలో నిలిచింది. దీంతోపాటు సుస్థిరాభివృద్ధిలో ఐదోస్థానం, సమానత్వం అంశంలో ఆరోస్థానం కైవసం చేసుకుంది. తెలంగాణ ఆవిర్భవించిన తొలిరోజు నుంచి పాటించిన ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించింది. యావత్ దేశాన్ని కొవిడ్ మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత సమన్వయంతో పనిచేసి ఆర్థిక వ్యవస్థ బలహీనపడకుండా చర్యలు తీసుకొన్నది. అందువల్లనే దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో సామాజిక, ఆర్థిక ప్రగతి లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరుతున్నాయి.
43 అంశాలు.. 14 లక్ష్యాలు :
దాదాపు 43 అంశాలు, 14 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ‘పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్’ పరిశోధన అంశాలుగా ఎంచుకున్నది. ఈ అంశాలను 1) అభివృద్ధి (గ్రోత్), 2) సమానత్వం (ఈక్విటీ), 3) సుస్థిరాభివృద్ధి (సస్టెయినబిలిటీ) విభాగాలుగా విభజించింది. ఈ మూడు విభాగాల్లో రాష్ట్రాల ఆర్థిక, భౌగోళిక పరిమాణాన్ని బట్టి 18 పెద్ద రాష్ట్రాలను, 11 చిన్న రాష్ట్రాలుగా, 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగా వర్గీకరించింది. పీఏసీ బృందాల సమగ్ర అధ్యయన నివేదికలన్నీ క్రోడీకరించి.. ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో అభివృద్ధి విభాగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా.. సుస్థిరాభివృద్ధిలో 5, సమానత్వ సూచీలో ఆరో స్థానంలో నిలిచింది.
విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాల ఫలితం:
ఏడేండ్ల కిందట ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు రచించి, అమలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు టీఎస్‌ఐపాస్ వంటి విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టి, రాష్ట్రంలో విస్తృతంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృషి ఫలించి రాష్ట్రానికి ఏడేండ్లలో 11 వేలకుపైగా పరిశ్రమలు తరలిరాగా, దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సుమారు 13 లక్షల మందికి ఉపాధి లభించింది. ఫలితంగా ఐటీ, ఫార్మా రంగాల్లో దేశంలోనే టాప్ స్థానానికి చేరుకున్నది. మరోవైపు స్థానిక యువతకు ఉపాధి కల్పన, రాష్ట్రంలో నిపుణులైన మానవ వనరుల తయారీకి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) వంటి సంస్థల ద్వారా లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ కృషిని గుర్తించి ఇప్పటికే అనేకమంది ఆర్థికవేత్తలు, నిపుణులు, వివిధ నివేదికలు ప్రశంసించాయి.