వైద్యారోగ్యరంగంలో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా మరోసారి నిలిచింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో తెలంగాణకు రెండు అవార్డులు దక్కాయి. వెల్‌సెన్ యాక్టివిటీస్‌లో దేశంలోనే మొదటి స్థానం, ఎన్సీడీ స్క్రీనింగ్‌లో రెండో స్థానంలో రాష్ట్రం నిలిచింది. యూనివర్సల్ హెల్త్ కవరేజీ డే-2021 సందర్భంగా ఢిల్లీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందజేసింది. కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ చేతుల మీదుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ అవార్డులను అందుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నవంబర్ 16 నుంచి డిసెంబర్ 13 వరకు ‘హెల్తీ అండ్ ఫిట్ నేషన్’ క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సబ్‌సెంటర్ల స్థాయిలో మూడు లక్ష్యాలను నిర్దేశించింది. ఒక సబ్‌సెంటర్ పరిధిలో కనీసం 100 మందికి ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) స్క్రీనింగ్ చేయాలని, 10 వెల్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని, కనీసం 100 డిజిటల్ ఐడీలు సృష్టించాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణలో వైద్య సిబ్బంది సబ్‌సెంటర్ల పరిధిలో నిర్వహించిన విస్తృత కార్యక్రమాలకుగాను రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కాయి.
వైద్య సిబ్బందికి అభినందనలు: మంత్రి హరీశ్‌రావు
తెలంగాణను రెండు క్యాటగిరీల్లో విజేతగా నిలిపిన వైద్య సిబ్బందికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్ర వైద్యరంగం బలోపేతమైందని మరోసారి నిరూపితమైందన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజీ డే సందర్భంగా రాష్ట్ర వైద్య సిబ్బంది అవార్డులను అందుకున్నారని వివరిస్తూ మంత్రి ట్వీట్ చేశారు.