ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లాలో జరిగిన 9 భారీ బహిరంగసభల్లో పాల్గొన్న కేసీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేత నరేంద్రమోడీ, టీడీపీ నేత చంద్రబాబునాయుడులపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు ఓటేస్తే దొంగలకు సద్ది కడతారని, రఘువీరారెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తే పొన్నాల జెండా ఊపితే, డీకే అరుణ మంగళహారతి పాడారని గుర్తుచేశారు. రాయలసీమకు నీళ్ళు తీసుకెళ్తుంటే నల్గొండ మంత్రులు సిపాయిల్లా, సామంతుల్లా ఉన్నారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు అసలు శత్రువు నరేంద్రమోడీ అని, బిడ్డను బతికించి తల్లిని చంపారని ఆయన అంటున్న మాటలు తెలివి తక్కువగా ఉన్నాయని విమర్శించారు. చంద్రబాబు నరరూపరాక్షసుడని, మోడీ వస్తే అరెస్టు చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు అదే మోడీ పంచన చేరి టీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే బాధ్యత మీదేనని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కొన్ని తరాలు అన్నివిధాలా నష్టపోయే అవకాశముందని, మన తలరాతను మనమే రాసుకుందామని ఆయన పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఏళేశ్వరం వద్ద ప్రాజెక్టును కట్టినట్లైతే నల్లగొండ జిల్లా మొత్తం సస్యశ్యామలం అయ్యేదని అన్నారు. మాకు పదవులు గడ్డిపోచతో సమానమని, కాంగ్రెస్ మంత్రులు ఒక్కరుకూడా పదవికి రాజీనామా చేయలేదని, తాను రాజీనామా చేస్తే పదవులు పట్టుకుని వేళ్ళాడింది కాంగ్రెస్ నేతలు కాదా? అని ప్రశ్నించారు. అధికారదాహంతో కాంగ్రెస్ నేతలు పదవులకు రాజీనామా చేయకపోవడంతోనే వేలమంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని, ఏమరుపాటుగా ఉంటే దోపిడీకి పాల్పడిన వారికి సహకరించిన దొంగలే మళ్ళీ అధికారంలోకి వస్తారనే టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, దోపిడీ ఇంకా కొనసాగిస్తారనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఫ్లోరైడ్ సమస్యతో నల్గొండ జిల్లా అల్లాడుతుందని, అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సరైన ఆలోచనా విధానం, అభివృద్ధి ఆకాంక్షతో వస్తున్న టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభకు హాజరైన వారిలో నల్లగొండ ఎంపీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శశిధర్ రెడ్డితో పాటు నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తలు ఉన్నారు.