నల్లగొండ జిల్లా కోదాడలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగసభకు టీఆర్ఎస్ అధినేత హాజరై ప్రసంగించారు. అధినేత రాక సందర్భంగా కోదాడ పట్టణమంతా గులాబీ మయమైంది. ఎక్కడ చూసినా గులాబీజెండాల రెపరెపలతో భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఎవరిచేతిలో ఉంటే బాగుంటుందో నిర్ణయించుకుని ఓటువేయాలని, ఇప్పుడు వస్తున్న ఎన్నికలు మామూలువి కావని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా రెండుమూడు తరాలు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు.
‘నాగార్జునసాగర్ అసలుపేరు నందికొండ. ఇప్పుడున్న ప్రదేశంలో కాకుండా 19 కిలోమీటర్లు ఎగువున ఉన్న ఏళేశ్వరం అనే గ్రామం వద్ద కట్టిఉంటే నల్లగొండ జిల్లా మొత్తం సస్యశ్యామలం అయ్యేది. మొదట తెలంగాణకు 120 టీఎంసీలు, ఆంధ్రా ప్రాంతానికి 60 టీఎంసీలు గా నిర్ణయించారు. కానీ అప్పుడు మన నాయకుల పొరపాటువల్ల ఇప్పుడది రివర్స్ అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన వాటా మనం రాబట్టుకుందామని’ కేసీఆర్ స్పష్టం చేశారు.
కష్టపడి సాధించిన తెలంగాణను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన మూర్ఖుల చేతిలో పెట్టొద్దని, ఆంధ్రా ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టులు కట్టడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలే సహకరించారని, వీళ్ళకు మంత్రి పదవులిచ్చి దర్జాగా సీమాంధ్రకు నీళ్ళు తరలించారని కేసీఆర్ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తానని అన్నారు.