తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవన శైలిని, సంస్కృతిని, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్ ద్వారా, ఛాయా చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటిన భరత్ భూషణ్ దశాబ్దాల కృషి గొప్పదని సీఎం అన్నారు. భరత్ భూషణ్ మరణంతో తెలంగాణ ఒక అరుదైన చిత్రకారుడు, ఫోటో జర్నలిస్ట్ ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా భరత్ భూషణ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ పల్లె సంస్కృతిని తన ఛాయా చిత్రాల్లో బంధించి అందించిన గొప్ప కళాకారుడు భరత్ భూషణ్ అని కొనియాడారు.
వరంగల్ జిల్లాకు చెందిన భరత్ భూషణ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వరంగల్లులో గుడిమల్ల అనుసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించిన భరత్ భూషణ్ ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చిన్ననాటినుంచే అటువైపు మళ్లారు. ఆయన ఫొటోలలో తెలంగాణ పల్లె జీవితం చక్కగా ఆవిష్కృతమవుతుంది. దైనందిన జీవితాన్నే కాదు, పండుగలను పబ్బాలనూ చిత్రీకరించారు. ముఖ్యంగా నిలువెత్తు తెలంగాణ జీవన వ్యాకరణాన్ని అయన గోడల మీది రాతలతో సహా సంక్షిప్తం చేశారు. చెరపలేని చరిత్రకు ఆనవాలు భరత్ భూషణ్ ఫొటోలు. సాంస్కృతిక రంగంలోనే కాదు, సాంఘీకంగా రాజకీయంగా కూడా తెలుగు ప్రజల జీవితాల్లో విడదీయరాని ముద్ర వేసిన ఎంతోమంది మూర్తిమత్వాన్ని భరత్ భూషణ్ ఎంతో హుందాగా చిత్రించారు. కవి శివ సాగర్, నల్ల కలువ టీ.ఎన్.సదాలక్ష్మి, జానపద పితామహులు బిరుదురాజు రామరాజు, కాళోజి వంటి వారి ఛాయా చిత్రాలు ఎంతో బాధ్యతగా తీసి పెట్టారు.
దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టడంతో గత కొంత కాలంగా భరత్ భూషణ్.. బసవ తారకం ఆస్పత్రిలో రేడియేషన్, కీమో చికిత్సలు తీసుకుంటున్నారు. తనకు ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా ఆయన భయపడేవారు కాదు. ‘మృత్యువుకి కళ అంటే భీతి అని, అందుకే అది తననింకా కబళించివేయలేదని’ ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతుండేవారు. “ఇప్పటికిప్పుడు నేను చనిపోయినా నా శరీరం అంటుకోదు. కాలిపోదు. కళా ప్రస్థానంలో నేను చేయవలసిన పనులు మిగిలే ఉన్నాయి. అవి తీరేదాకా నాకు మరణం లేదు” అని అన్నప్పటికీ అంతలోనే ఈ విషాదం నెలకొంది.