మనకు బాస్ లెవరూ లేరని, తెలంగాణ ప్రజలే మన బాస్ లని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని, ఎవరికి ఏ సమస్య వచ్చినా తనకే చెప్పొచ్చని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు ఎట్లున్నానో వచ్చే ఐదేళ్ళు కూడా అట్లాగే ఉంటానని, సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని మన సామర్ధ్యమేంటో నిరూపించుకుందామని ప్రజలకు వివరించారు. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటమే తమ ధ్యేయమని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ధనవంత రాష్ట్రంగా తయారుచేద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
అనంతరం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలి కాబినెట్ మీటింగ్ జరిగింది. ఏలె లక్ష్మణ్ రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను అధికారికంగా ఖరారు చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, కాబినెట్ సమావేశం మర్యాదపూర్వకంగా జరిగిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కేసీఆర్ ఆధ్వర్యంలో తాము పనిచేస్తామని తెలిపారు.
తెలంగాణ చిహ్నం, వివిధ శాఖలకు అధికారుల కేటాయింపు అంశంపై చర్చించామని, ఈ నెల 9 నుండి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని, ఆ తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందని నాయిని పేర్కొన్నారు. అయితే వీలైనన్ని ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలని, బ్యాంకర్లతో సమావేశమైన తర్వాత రుణమాఫీపై నిర్ణయం తీసుకోనున్నట్లు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వివరించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1.38కోట్లతో ఖాతా తెరిచినట్లు జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని మరొక బ్యాంకు ఆథరైజ్ చేసే వరకూ లీడ్ బ్యాంక్ గా ఆర్‌బీఐ వ్యవహరిస్తుందని జీవోలో పేర్కొన్నారు.